పోడు రైతులను భూముల నుంచి వెళ్లగొట్టే ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం
తెలంగాణలో హక్కుల హననం
పోడు భూములకు హక్కులు కల్పించండి
ఇదే రీతి కొనసాగితే పాలన స్తంభింపజేస్తాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
పోడు సదస్సులకు పోటెత్తిన పోడు రైతులు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో ‘భూములు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చు డు కంటే గుంజుడు ఎక్కువైంది. పోడు రైతులను భూముల నుంచి వెళ్లగొట్టేందుకు ఈ ప్రభు త్వం పూనుకుంది. ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం’ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి చేపట్టిన పోడు యాత్ర శనివారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని పలు మండలాల్లో కొనసాగింది. చింతకాని, రఘునాథపాలెం, ఏన్కూరు, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, పాల్వంచ మండలాల్లో సాగింది. దారి పొడవునా పోడు రైతులు చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు తమ గోడును వినిపించారు. హక్కు పత్రాలు ఉన్నా భూమి నుంచి తరిమేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు చేశామ న్న నేరం మోపి జైళ్లకు పంపుతున్నారని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోదుమూరు గ్రామంలో స్వాతంత్య్రం రాక ముందు నుంచి సాగు చేసుకుంటున్న భూములకు 1970 దశకంలో పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు ఆ భూములను కూడా గుంజుకుంటున్నారని రైతులు నాయకుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా పలు చోట్ల పోడు రైతుల సదస్సులను నిర్వహించారు. సదస్సులో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో స్వేచ్ఛ హరించబడుతుందన్నారు. పోడు రైతుల ఇబ్బందులను ఈ యాత్ర ద్వారా తెలుసుకున్నామని, యాత్ర ముగిసిన తర్వాత పోడు రైతులతో ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ఆయన ప్రకటించారు. పోడు రైతుల కష్టాలకు కారకుడు ముఖ్యమంత్రి కెసిఆరే అన్నారు. పోడు రైతులపై దాడులు ఆపకుంటే ప్రతిఘటన తప్పదని చాడ హెచ్చరించారు. ఉంటే భూమిలో ఉంటాం లేదంటే జైలులో ఉంటాం తప్ప పోడును వదిలే ప్రసక్తే లేదని, చావో రేవో తేల్చుకునేందుకు తాము సిద్ధమయ్యామన్నారు. తెలంగాణ సాధనలో ఎర్ర జెండాల పాత్రను మరచిపోయిన ముఖ్యమంత్రికి మరోసారి ఎర్రజెండాల పోరాట పటిమను చూపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పసి పిల్లలను జైళ్లకు పంపి కెసిఆర్ ఏమీ పాలన సాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురు కాకుండా కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తే మంచిదన్నారు.
పోడు జొలికొస్తే సహించం : కూనంనేని సాంబశివరావు
పోడు భూమి కెసిఆర్ జాగీర్ కాదని, పోడు భూమి జొలికొస్తే సహించేది లేదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మన భూమి మనకు దక్కేందుకే సిపిఐ పోడు యాత్ర చేపట్టిందని ఆయన తెలిపారు. జిల్లాలో జరిగిన పోడు సదస్సులో కూనంనేని మాట్లాడుతూ పోడు సాగు చేసుకునే ప్రాంతాల్లోనే అడవి పరిరక్షించబడుతుందని, అడవి బిడ్డలు ఉన్న చోట తప్ప మిగిలిన చోట్ల లక్షల ఎకరాల అటవీ భూమి మాయమైందన్నారు. పేదలపై దాడులు ఆపి ధనవంతులు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుని హరితహారం మొక్కలు నాటాలని కూనంనేని డిమాండ్ చేశారు. హైవేల నిర్మాణంలో కోల్పోతున్న భూమికి బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, ఎన్.బాలమల్లేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, ఎస్‌కె సాబీర్‌పాషా, రాష్ట్ర నాయకులు కాంతయ్య, తాటి వెంకటేశ్వరరావు, ఆర్.అంజయ్య నాయక్, రామ్మూర్తి, ప్రజానాట్యమండలి గాయకులు పల్లె నర్సింహా, ఉప్పలయ్య, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోడు సమస్యపై ప్రజా నాట్యమండలి గాయకులు ఆలాపించిన గీతాలు ప్రజలను ఆలోచింపజేశాయి.
ఘన స్వాగతం :
సిపిఐ పోడు యాత్ర నాయకుల బృందానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఖమ్మంలో ప్రారంభమైన పోడు యాత్రకు ప్రతి మండలంలోనూ జనం ఎదురువచ్చి స్వాగతం పలికారు. డప్పు దళాలతో ఎదురొచ్చి పార్టీ ఉద్యమ కార్యాచరణకు అండగా నిలబడతామని ప్రజలు డప్పు కొట్టి మరిచెప్పారు. ఖమ్మంజిల్లాలో ఖమ్మం నుంచి కోదుమూరు, తిమ్మారావుపేట వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దఎత్తున యువకులు పాల్గొనడం గమనార్హం. జూలూరుపాడు వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. వినోబానగర్ వద్దకు వందలాది మంది పార్టీ కార్యకర్తలు, పోడు రైతులు చేరుకుని యాత్ర బృందానికి స్వాగతం పలికి అక్కడి నుంచి జూలూరుపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సిపిఐ పోడు యాత్ర పోడు రైతులకు భరోసానిచ్చింది. పోడు కోసం పోరాడేందుకు ఊతంగా నిలిచింది.
ఇచ్చుడు లేదు… గుంజుడెక్కువైంది
RELATED ARTICLES