అబద్ధపు, తప్పుడు హామీలివ్వను
మాటిచ్చానంటే శిలాశాసనమే : రాహుల్
ప్రజాపక్షం / హైదరాబాద్ : అబద్ధాలు, తప్పుడు వాగ్ధానాలు ఇచ్చే అలవాటు తనకు లేదని, తాను మాట ఇస్తే తప్పనని, చేసి చూపిస్తానని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. తాను రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి మనిషికి రూ. 15 లక్షలు బ్యాంకులో వేస్తాననే భారీ వాగ్ధానాలు చేయనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏటా నిర్దిష్ట సమయంలో ఫీజు రీయింబర్స్ నిధులను విడుదల చేస్తామని, ప్రైవేటు విద్యాసంస్థలను ఆదుకుంటామని ప్రకటించారు. శంషాబాద్ కెజి టు పిజి జెఎసి ఆధ్వర్యంలో గురువారం “ తెలంగాణలో విద్యా రంగ మార్పు” అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, టిపిసిసి అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఆర్ కుంటియా, టిజెఎస్ అధ్యక్షులు ఎం. కోదండరామ్ తదితరుల ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు, సిబ్బంది, టీచర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ “గత 15 ఏళ్ళ నా ప్రసంగాలు చూడండి. అన్నింటినీ పరిశీలించండి. వాటిల్లో నేను మాటిచ్చి తప్పిన ఒక్క వాగ్ధామేదైనా దొరికితే చెప్పండి. నాకు ప్రజలకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. నాకు తప్పుడు వాగ్ధానాలు చేసే అలవాటు లేదు. కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో రైతు రుణ మాఫీ చేస్తామన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేసి చూపించాం. ఆ రెండు రాష్ట్రాల్లో ఎవ్వరికైనా ఫోన్ చేసి రాహుల్, కాంగ్రెస్ రుణమాఫీ చేసారా? అని అడిగితే మీకే సమాధానం దొరుకుతుంద’ని అన్నారు. తాను మాటిస్తే సీరియస్ తీసుకుంటానని, తాను, పిసిసి చీఫ్ ఈ వేదిక నుంచి ఇచ్చిన మాట శిలాశాసనం లాంటివని, వాటిని గ్యారెంటీగా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ సమాన అవకాశాలు ఉండాలని కోరుకుంటుందన్నారు. ప్రధాని మోడీ దేశంలో 15 మంది ధనవంతులకు రూ. 3.50 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని, అదే రీతిలో రైతులకు కూడా చేయాలన్నారు.ముఖ్యంగా సకాలాంలో ఫీజు రీయింబర్స్ రాక ప్రైవేటు విద్యా సంస్థలు ఇబ్బంది పడుతున్నాయన్నారు.
ఇచ్చిన మాట తప్పను
RELATED ARTICLES