కొవిడ్-19 కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం
27న వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం, ఆగస్టు 2న రచ్చబండ
ప్రతిపక్షాల ప్రకటన
ప్రజాపక్షం/హైదరాబాద్
కొవిడ్- కట్టడి చేసి, నివారణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ప్రభుత్వానికి వినతులు, విజ్ఞాపన పత్రాల అందజేసే సమయం దాటిపోయిందని, అందరూ కలిసికట్టుగా ఐక్య పోరాటానికి ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ నెల 27న ఆన్‌లైన్ వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని, ‘రచ్చబండ’ పేరుతో ఆగస్టు 2న వర్చువల్ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ సమావేశాల్లో కలిసొచ్చే అన్ని రాజకీయ పార్టీలతో పాటు, ప్రజా, కుల, వృత్తి సంఘాలన్నీ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని వివరించాయి. ఆక్సిజన్ కొరత, ఆస్పత్రిలో సౌకర్యాల లేమితో పలువురు తమ ప్రాణాలు వదులుతున్నారని, మరికొందరు ఆస్పత్రికి వెళ్లేందుకే జంకుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజలను బతికించేందుకు గల్లీ స్థాయి నుంచే పోరాటాన్ని విస్తృతం చేయనున్నట్టు వెల్లడించాయి. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూం భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్దన్, ఎస్‌యుసిఐ(సి) నాయకులు మురహరి, న్యూ డెమోక్రసీ నాయకులు చలపతి మాట్లాడారు. కరోనాపై కెసిఆర్ ప్రభుత్వ వైఖరి నేరపూరిత నిర్లక్ష్యంగా ఉన్నదన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మరో ఆరు మాసాలకు వరకు పేద కుటుంబాలకు రూ. 7500 ఆర్థిక సాయం చేయాలని, అలాగే 12 కిలోల రేషన్‌తో పాటు అన్ని నిత్యావసర వస్తువులను ఉచితంగా సరఫరా చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మండలస్థాయి నుంచి కరోనా పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: చాడ
కొవిడ్ నేపథ్యంలో అవసరమైతే బాండ్స్ ద్వారానైనా డబ్బులు వసూలు చేసి ప్రజలను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆగమేఘాలపై సచివాలయాన్ని కూల్చివేయాల న్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడడంపై లేదని విమర్శించారు. కొవిడ్‌తో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వం దల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కొవిడ్‌ను అసలు పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. కరోనా కిట్స్ కార్పొరేటర్ల చేతిలో ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని, తద్వారా ప్రజా వ్యతిరేక విధానాలను, కొవిడ్ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ప్రజలను బతికించుకునేందుకు అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తామన్నారు.
విసిగిపోయాం.. ఇక బతుకుదెరువు పోరాటమే: కోదండరామ్
ప్రజల బతుకు దెరువు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అనేక అంశాలను ప్రతిపక్షాలుగా తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అనేక వినతులు, విజ్ఞాపన పత్రాలను అందజేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని, అభద్రతాభావంతో ఉన్నారన్నారు. మంచి వైద్యాన్ని అందిచడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సిఎం సహాయ నిధికి ఎంత మొత్తంలో నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చిన్న వ్యాపారాలు, కులవృత్తులు కుప్పకూలాయని, ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, జీతాలను ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 45ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బిజెపి ప్రభుత్వంతో కెసిఆర్ లాలూచీ: తమ్మినేని
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో సిఎం కెసిఆర్ లాలూచి పడ్డారని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, సిఎఎ, నూతన విద్యుత్ బిల్లును వ్యతిరేకించిన సిఎం కెసిఆర్ ప్రత్యేక్ష ఉద్యమంలోనికి మాత్రం రావడం లేదని, మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్నారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించినప్పటికీ కెసిఆర్ ప్రశ్నించలేదన్నారు. కొవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రకటించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. కొవిడ్ కేసుల వరకైనా ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం నియంత్రించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ సౌలభ్యం మేరకే కేంద్రం లాక్‌డౌన్‌ను విధించిందన్నారు.
కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్నారు : రమణ
ప్రగతిభవన్‌లో కరోనా వైరస్ సోకితే సిఎం కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్నారని, పేదలకు కనీసం ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా అవకాశం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ అన్నారు. ప్రజలకు కరోనా వైరస్ సోకితే అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలిస్తే, టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారని గుర్తుచేశారు.
సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్దన్ మాట్లాడుతూ కొవిడ్ రాకుండా అడ్డుకుంటానని, రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా అడ్డుకుంటానని ప్రకటించిన సిఎం కెసిఆర్, ఇప్పుడు కేవలం రూ.100 కోట్లు విడుదల చేయడం అన్యాయమన్నారు. న్యూ డెమోక్రసీ నాయకులు చలపతి మాట్లాడు తూ రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్‌యుసిఐ నాయకులు మురహరి మాట్లాడుతూ కరోనీ నివారణలో విఫలమైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చివరకు చెత్తులేత్తేశాయన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నర్సింహ, టిజెఎస్ నాయకులు పంజగుల శ్రీశైల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇక వినతులొద్దు..పోరాటమే
RELATED ARTICLES