ప్రచారంతో పాటు నిర్వహణ ఏర్పాట్లలో పార్టీలు
కొత్త వారిని ఎంచుకోవటంలో కాంగ్రెస్
ఉన్న వారిని సమాయుత్తం చేయడంలో టిఆర్‌ఎస్
హైదరాబాద్ : ప్రచారానికి మరో వారం రోజులే మిగిలి ఉన్న వేళ అన్ని రాజకీయ పక్షాలతో పాటు ఎన్నికల సం ఘంలోనూ కదలికలు ముమ్మరమయ్యాయి. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేగాన్ని పెంచగా, మండుతున్న ఎండలతో ముమ్మర ప్రచారం చేయలేక ప్రత్యామ్నాయ ప్రచార మార్గాలపై రాజకీయ పార్టీలు దృష్టి సా రించాయి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారహోరు జోరుగా ఉన్నప్పటికీ తెలంగాణలో అంత జోరు కన్పించడం లేదు. అక్కడ బరిలో మూడు ప్రధాన పార్టీలు ఉండడం, పైగా రాష్ట్రంలో తెలుగుదేశానికి, వైసిపికి అధికారం దక్కించుకోవడం చావో రేవో అన్న అంశంగా మారడంతో ప్రచార వేడి పెరిగింది. తెలంగాణలో అధికారం డిసైడ్ అయిపోవడంతో కేవలం లోక్‌సభ ఎన్నికల పర్వమే కావడంతో ఎపితో పోలిస్తే సహజంగానే ఇక్కడ కొంత జోరు తగ్గింది. పైగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కకావికలం కావడంతో అధికార టిఆర్‌ఎస్‌లో లోక్‌సభ ఎన్నికల్లో విజయంపైనా ధీమా పెరిగింది. అయినప్పటికీ కేం ద్రంలో చక్రం తిప్పాలంటే మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం తప్పనిసరి కాబట్టి టిఆర్‌ఎస్ కూడా ప్రచార పర్వాన్ని సవాల్‌గా తీసుకుంది. షెడ్యూల్ విడుదలైన తొలిరోజుల్లో ప్రచార పర్వం మందగమనంలో ఉన్నప్పటికీ వివిధ పార్టీల కేంద్ర నాయకులు, ప్రముఖులు ప్రచారపర్వం నిర్వహించడంతో ఇప్పుడిప్పుడే తెలంగాణలోనూ ఎన్నికల వేడి పెరిగింది. ప్రధాని మోడీ, రాహూల్ గాంధీ వంటి వారు ఓ దశ ప్రచారపర్వానికి వచ్చి స్తబ్ధతతో ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో చలనం తీసుకువచ్చారు. వారిచ్చిన ఉత్సాహంతో ఆ రెండు పార్టీలు కూడా ప్రచారపర్వాన్ని ముమ్మరం చేశాయి. ఇక టిఆర్‌ఎస్ విషయానికి వస్తే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కెటిఆర్ జిల్లాల పర్యటనలతో ఓ విధమైన ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టగా ప్రస్తుతం ఆయన ఓవైపు, సిఎం కెసిఆర్ మరోవైపు ప్రతి రోజు ప్రచార సభలతో దూసుకుపోతున్నారు. ఎండలు ముదరడం అన్ని పార్టీలకు ప్రచా రం నిర్వహించడాన్ని సవాల్‌గా మార్చేశాయి. అయితే ఉదయం, లేదంటే సాయంత్రం మాత్రమే బహిరంగ సభలు, లేదా ఇంటింటి ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల కారణంగా ప్రముఖుల బహిరంగ సభలు కూడా జనం లేక వెలవెల బోతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కెసిఆర్ సభకు జనం లేకపోవడంతో మరోసారి ఇలాంటి సభల నిర్వహణకు ఆయా పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. దీంతో ముదురుతున్న ఎండలకనుగుణంగానే అన్ని పార్టీలు వారి ప్రచార వ్యూహాన్ని రచించుకుని అమలు చేస్తున్నాయి. ఉదయం పది గంటల లోపు అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు, అభ్యర్థులు వారి ప్రచార సభలను సాయంత్రం పూట ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇంటింటికి వెల్లడం, ఓటర్లను కలవడం, పోలింగ్ సందర్భంగా బూత్‌లలో ఏజెంట్ల నియామకం కోసం నాయకులను ఎంపిక చేయడం వంటి వాటిపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి రెడ్డొచ్చే మొదలుపెట్టు అన్న చందంగా మారడంతో వారికి ఈ ఏర్పాట్లు కత్తి మీద సాములా తయారైంది. డికె.అరుణ, పొంగులేటి సుధాకర్,మాజీమంత్రి విజయరామారావ్, సొ యం బాపురావ్ వంటి వారు పార్టీ మారారు. వీరితో పాటు పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా ప్రముఖ నేతలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను వీడారు. గత ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పంపకాల దగ్గర నుంచి పోలింగ్ నిర్వహణ వరకు వీరి అనుచరులే కాంగ్రెస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు వీరు వీడడంతో పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో, వీదుల స్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని కోసం కొత్త నాయకులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈ సారి కష్టపడాల్సి వస్తోంది. కనీసం బూత్‌లలో ఏజెంట్లను కూడా నియమించుకోలేని పరిస్థితులు తలెత్తితే ఎలా అన్న సమస్య కూడా వారిని వేదిస్తోంది. తెలంగాణలో బరిలో ఉన్న మరో ప్రధాన పార్టీ బిజెపికి అంతగా కష్టపడడం లేదు. కారణం ఇంతకు ముందు తెలంగాణలో దానికి వచ్చి స్థానాలు ఒకటి, రెండు తప్ప అంతకు మించి లేదు. ఇప్పుడు కూడా అంతే చాలు అన్నట్లుగా ఉంది. పైగా ఈ సారి కొంత ఉత్సాహం కనిపిస్తోంద. కారణం ఇతర పార్టీల నుంచి డికె.అరుణ, జితేందర్‌రెడ్డి, పొగులేటి సుధాకర్ రెడ్డి, మాజి మంత్రి విజయరామారావ్ వంటి నాయకులు చేరడంతో మరింత బలోపేతం అయ్యామన్న భావన బిజెపిలో నెలకొంది. ఇలా చేరిన వారికి వారి నియోజకవర్గాల్లో సొంత క్యాడర్ ఉండడంతో, వారికి బిజెపి క్యాడర్ తోడయి గట్టిపోటి ఇస్తామని, అదృష్టం కలిసి వస్తే ఇలాంటి చోట్ల గెలిచే అవకాశాలు లేకపోలేదన్న ధీమా బిజెపిలో కనిపిస్తోంది.
ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసి ఎన్నికల సంఘం : మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో ఒకటి రెండు సార్లు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటి కమిషనర్ ఉమేష్‌సిన్హా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సారి దేశంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్‌లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు ఉండడంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారింది. ఇవిఎంల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది ఇంజనీర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో విధుల్లో ఉన్నారు. ఇప్పుడు కేవలం ఒక్క నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి దాదాపు 600 మంది ఇంజనీర్లు అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనాకు వచ్చింది. పైగా ప్రత్యేకమైన ఇవిఎంలను సిద్ధం చేసే పనిని మొదలుపెట్టింది. ఎన్నికల సిబ్బంది, వారికి ఇవిఎంలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తోంది. ప్రత్యేకించి నిజామాబాద్‌లో ఇవిఎంలపై ప్రజలకు కూడా ప్రత్యేక అవగాహణ కల్పించాల్సి రావడంతో ఆదిశగా ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందినే ఈ సారి వినియోగించుకోవడంతో వారికి ఎన్నికలనిర్వహణపై ఇప్పుడు ప్రత్యేక అవగాహన అంతగా అవసరం లేకపోవడం ఎన్నికల సంఘానికి కొంత కలిసివస్తోంది. అయితే నిజామాబాద్ ఎన్నిక భిన్నంగా మారడంతో దానిపైనే ఎన్నికల సంఘం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
ఇక వారమే
RELATED ARTICLES