నూతన సంవత్సరం
తొలి రోజు నుంచే మొదలు
మూడు రోజుల పాటు నీటిపారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్న సిఎం
అనంతరం ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ దశలపై సమీక్ష
ప్రజాపక్షం / హైదరాబాద్ : కొత్త ఏడాది మొదటి రోజునే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ర్టంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేయనున్నారు. జనవరి ఒకటవ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాళేశ్వరం, ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవ ప్రాజెక్టు సైట్‌ల వద్ద పరిశీలన, తరువాత అన్ని ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ దశలపై హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. అందుకు ముందు ఈ నెల 31న రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రిటైర్డు ఇంజినీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణ పనులను పరిశీలిస్తుంది. అదే రోజు సాయంత్రం రిటైర్డు ఇంజనీర్లు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పనుల పురోగతిని వివరిస్తారు. జనవరి 1న రిటైర్డు ఇంజనీర్ల బృందం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తుంది. అక్కడ పనులను పర్యవేక్షిస్తారు. జనవరి 2న రిటైర్డు ఇంజనీర్ల బృందం సీతారామ ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. జనవరి 1న హైదరాబాద్ లో జరిగే హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.