తప్పనిసరి చేయనున్న సర్కారు
నివేదిక ఆధారంగా భవనాలకు అనుమతులు
అంచనాల ద్వారా ఫీజుల నిర్ధారణ
భవిష్యత్ ట్రాఫిక్ అసెస్‌మెంట్ అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్
త్వరలోనే ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్న జిహెచ్‌ఎంసి
ప్రజాపక్షం/హైదరాబాద్: భారీ భవనాల నిర్మాణానికి ముందు ట్రాఫిక్ అంచనా నివేదిక ఆధారంగా అనుమతులు మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ మహా నగరంలో ఇబ్బడి మబ్బడి ఒకే ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముందస్తు ట్రాఫిక్ అంచనా లేకుండా అనుమతులు ఇవ్వడంతో తీవ్రమైన ట్రాఫిక్ చిక్కులు ఏర్పాడుతున్న విషయం తెల్సిందే. భవిష్యత్‌లో హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసిల పరిధిలో ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్(టిఐఎ) చేసిన అనంతరమే అనుమతులు ఇస్తారు. టిఐఎ అధ్యయనంలో ట్రాఫిక్ అంచనాకు విరుద్ధంగా వస్తే అనుమతులు నిరాకరించనున్నారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేశారు. భవన నిర్మాణాల అనుమతులు, ట్రాఫిక్ అసెస్‌మెంట్ అంశాలపై లీ అసోసియేట్స్‌కు అధ్యయన బాధ్యత అప్పగించారు. సంవత్సరం కాలంగా అధ్యయనం జరిపిన లీ అసోసియేట్స్ ఇటీవలనే జిహెచ్‌ఎంసికి నివేదిక అందచేసింది. నివేదికలో కీలకమైన అంశాలపై సిఫారసులు చేసింది. అధ్యయన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి జిహెచ్‌ఎంసి పంపించనుంది. భారీ భవన నిర్మాణాలపై ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అంచనా, అందుకు అనుగుణంగా ఫీజులను త్వరలో మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి), హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండిఎ) విధించనున్నాయి. ప్రధానంగా వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే భవన సముదాయాలైన వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే కొత్త భవనాలపై ఈ ఫీజు విధించనున్నారు. ప్రధానంగా వ్యాపార, వాణిజ్య, ఐటీ కంపెనీలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు, సంబంధిత భవనాలకు ప్రతి రోజు ఎన్ని వాహనాలు వస్తాయి, ఎంత సమయం వరకు ఉంటాయనే అంచనాలు రూపొందిస్తారు. ఎక్కువ మంది వాహనాల ద్వారా రావడంతో ట్రాఫిక్‌పై ప్రభావం చూపిస్తుంది. ట్రాఫిక్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందనే అంశం ఆధారంగా నిర్మాణ అనుమతులతో పాటు, ఫీజు విధిస్తారు. నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు జిహెచ్‌ఎంసి రోడ్డు విస్తరణ, భారీ ఎత్తున ఫ్లుఓవర్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా సంబంధిత భవన నిర్మాణానికి సంబంధించిన రహదారిలో ఫ్లుఓవర్, జంక్షన్ అభివృద్ది తదితర వాటికి ఈ ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ ఫీజును ఉపయోగిస్తారు. నిర్మాణానికి ముందే సంబంధిత రోడ్డులో ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేస్తారు. భవనం అందుబాటులోకి వస్తే ఎంత శాతం మేరకు ట్రాఫిక్‌పై ప్రభావం చూపిస్తుందనే అంశాన్ని దీని ద్వారా గుర్తిస్తారు. ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ ప్రభావం చూపితే అనుమతులు నిరాకరిస్తారు. లేదంటే పెద్ద మొత్తంలో ఫీజు నిర్థారిస్తారు. లేదంటే సాధారణ భవన నిర్మాణానికి మాదిరిగానే అనుమతులు ఇస్తారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు, మాల్స్, మల్టీప్లెక్సీలు, ఆసుపత్రులు(పడకల ఆధారంగా), వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు సంబంధించిన వాటికి మాత్రమే ఈ ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్, నివేదిక, ఫీజుల ఆధారంగా అనుమతులు ఇస్తారు. పెద్ద మొత్తంలో ఉద్యోగులు పనిచేసే సంస్థలు(ఐటీ కంపెనీలు), మల్టీపెక్సీలు, వాటి వల్ల పెద్ద సంఖ్యలో వాహనదారులు రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడే వాటికి ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సర్వే నిర్వహించి, ఫీజు విధించనున్నారు. సాధారణ నివాసాలు, అపార్ట్‌మెంట్‌లకు ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ ఫీజు విధించవద్దని నిర్ణయించారు.