ఓటమిపై కాంగ్రెస్ ఆత్మావలోకనం
రాజీనామాకు సిద్ధపడిన రాహుల్
ఏకగ్రీవంగా తిరస్కరించిన సిడబ్ల్యుసి
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి తనదే బాధ్యత అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించారు. కొత్త అధ్యక్షునిగా గాంధీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యుసి రాహుల్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా తిరస్కరించింది. సిడబ్ల్యుసి సమావేశం శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై సుదీర్ఘంగా సమీక్షించింది. ఓటమిపై ఆత్మావలోకనం చేసుకోవాలని అభిప్రాయపడింది. అలాగే పార్టీల్లో సమూల ప్రక్షాళనకు సిడబ్ల్యుసి పిలుపునిచ్చింది. అన్ని స్థాయుల్లోనూ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక సమావేశంగా పరిగణిస్తూ నాలుగు గంటలపాటు సిడబ్ల్యుసి సుదీర్ఘ చర్చ జరిపింది. పరాజయానికి గల కారణాలను అన్వేషించింది. రాహుల్ రాజీనామాతో పరిష్కారం కాదని, పైగా ఈ సమయంలో రాహుల్ రాజీనామా చేస్తే పార్టీ శ్రేణులు మరింత డీలాపడిపోతాయని పేర్కొంది. రాహుల్ తన రాజీనామాను కమిటీ ముందు సమర్పిస్తూ, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరారు. పార్టీను గెలుపు పంథాలో నడిపించడంలో తాను పూర్తిగా విఫలమయ్యానని ఆ లేఖలో రాహుల్ పేర్కొన్నారు. అయితే రాహుల్ ఈ సమావేశంలో ఎలాంటి ప్రసంగం చేయలేదు.
ఇక ప్రక్షాళనే!
RELATED ARTICLES