మరింత పకడ్బందీగా అమలు
త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు
అధికారులతో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్: గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. రోజూ ప్రతీ గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరగాలని, గ్రామాలు బాగుండటం కోసం ప్రతీ రోజు జరగాల్సిన పని జరిగి తీరాలని సిఎం అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఎలా అమలవుతున్నదీ, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో విధులు ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో తానే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు జరుపుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిథులు ఫొటోలకు ఫోజులిచ్చే కార్యక్రమం కాకుండా, చిత్తశుద్ధితో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే పనులు చేయించాలని కోరారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సిఎం వెల్లడించారు. పల్లెప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పిసిసిఎఫ్ శోభ, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.