పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం
స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలి
జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలి
గ్రామ పంచాయతీ ఎన్నికలపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రలో మూడు విడుతలలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషి కోరారు. సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, డిజిపి మహేందర్‌రెడ్డిలతో కలసి పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జోషి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎవరైనా పోలింగ్ సిబ్బందికి అనుకోని సంఘటన ఎదురైనప్పుడు తక్షణమే స్పందించేలా ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. అధికారి వివరాలను పోలింగ్ సిబ్బందికి తెలపాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామా గ్రి, భద్రత ప్రణాళిక, వాహనాలు, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ హాళ్లు, డిస్ట్రిబ్యూషన్, కౌం టింగ్, స్టోరేజ్ సెంటర్ల గుర్తింపు, బడ్జెట్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు. 25 రోజులలో ఎన్నికలు పూర్తి కావలసి ఉన్నందున కలెక్టర్లు పూర్తి సంసిద్ధులై ఉండాలన్నారు. గ్రామ పంచాయతీలలోఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ప్రజలకు తెలిసేలా పోలింగ్ స్టేషన్లు, వార్డుల సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పని చేయాలని, ముందుస్తు ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. మొదటి, రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలకు రిటర్నింగ్ అధికారుల నియామకం, గుర్తించిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ, మైక్రో అబ్జర్వర్ల నియామకం, మండలాలకు అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్‌పెండీచర్, అబ్జర్వర్ల నియామకం తదితర అంశాలపై సమీక్షించారు. పోలింగ్ సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.