నేడు చంద్రయాన్ – 2 ప్రయోగం
మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రయోగించనున్న ఇస్రో
విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్
శ్రీహరికోట : ఇటీవల వాయిదా పడిన భారత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2 ప్రయోగం ఇక ఆగేది లేదంటూ మన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. బాహుబలిగా పిలిచే జిఎస్‌ఎల్‌వి మార్క్-3 ఎం1 వాహక నౌక దీన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. 3.8 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాన్ని వాహకనౌక రోదసీలోకి తీసుకెళ్తుంది. జులై 15న తెల్లవారుజామున నిర్వహించాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాకెట్‌కు ఇస్రో ఛైర్మన్ కె. శివన్ ఆధ్వర్యంలో మళ్లీ లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. ప్రయోగ సమయానికి 20 గంటల ముందు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. చంద్రయాన్ 2 విజయవంతంగా చంద్రునిపైకి చేరుకుంటే అది చరిత్రాత్మకమవుతుంది. చంద్రునిపైకి రోవర్‌ను దించిన నాల్గవ దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. అలాగే చంద్రునికి దక్షిణ ధృవంవైపు రోవర్‌ను దిం చిన తొలి దేశంగా కూడా భాతర్ అవతరించబోతున్నది. 20 గం టల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్‌ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్.. 3,850 కిలోల బరువుగల చంద్రయాన్2 ఉపగ్రహాన్ని భూమి నుంచి చంద్రుడిపైకి మోసుకెళ్తుంది. జీఎస్‌ఎల్వీ మార్క్ 3ఎం1 రాకెట్ పొడవు 43.43 మీటర్లు, బరువు 640 టన్నులు. ఇందు లో 3,850 కిలోల బరువుగల చంద్రయాన్2 మిషన్‌ను పంపుతున్నారు. ఉపగ్రహంలో 2.3 టన్నుల ఆర్బిటర్, 1.4 టన్నుల ల్యాండర్ (విక్రమ్), 27 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)లో 14 ఇండియన్ పేలోడ్స్ (ఉపకరణాలు)తోపాటు ఆమెరికాకు చెందిన రెండు, యూరప్ దేశాలకు సంబంధించి రెండు పేలోడ్స్‌ను కూడా పంపిస్తున్నారు. మొదటి దశలో జీఎస్‌ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్, దాని ఇరువైపులా ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్200 బూస్టర్ల సాయంతో నింగికి పయనమవుతుంది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 131.30 సెకన్లలో మొదటి దశను పూర్తి చేస్తారు. రెండో దశలో ద్రవ ఇంజన్ మోటార్లు 110.82 సెకన్లకే ప్రారంభమవుతాయి. 203 సెకన్లకు రాకెట్ శిఖర భాగాన అమర్చిన చంద్రయాన్2 మిషన్కు ఉన్న హీట్ షీలడ్స్ విడిపోతాయి. ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 308.50 సెకన్లకు రెండో దశను పూర్తి చేస్తారు. మూడో దశలో అత్యంత కీలకమైన క్రయోజనిక్ (సీ25) మోటార్లు 310.90 సెకన్లకు ప్రారంభమవుతాయి. 958.71 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేస్తారు. అనంతరం రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీఇన్‌వన్ చంద్రయాన్2 మిషన్ 973.70 సెకన్లకు (16.21 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170.06 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజీ) 39,059.6 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసిన్ట్రిక్ ఆర్బిట్ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఈ బాధ్యతను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ అధీనంలోకి తీసుకొని మిషన్ చంద్రుడిపైకి వెళ్లే వరకు ఆపరేషన్ నిర్వహిస్తుంది.