రైల్వేల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలి : సిపిఐ
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : భారత రైల్వేలను ప్రైవేటీరంగానికి అప్పగించాలన్న బిజెపి ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. తక్షణమే మోడీ సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా గురువారంనాడొక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో 109 రైళ్లను నడపాలని, ఈ ప్రాజెక్టులో 30,000 కోట్ల రూపాయల మేరకు ప్రైవేటు పెట్టుబడులు పెట్టాలని, ఈ ప్రాజెక్టు రాయితీ కాలాన్ని 35 ఏళ్లకు ఉంచాలని తదితర నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకున్న విషయం విదితమే. జాతీ య ఆస్తులు, వనరులను పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్లకు అప్పగించాలన్నదే మోడీ ప్రభుత్వ విధానమని, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో దేన్నీ వదిలిపెట్టడం లేదని రాజా విమర్శించారు. మోడీ పాలనలో ఇప్పటివరకు బొగ్గు గనులు, బ్యాంకులు, రక్షణ, చమురు, బీమా, విద్యుచ్ఛక్తి, టెలికం, అంతరిక్షం, అణు ఇంధన రంగాలన్నింటినీ కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటికే రైల్వేల్లో ఉత్పాదక విభాగాలను ప్రైవేటువారి చేతుల్లో పెట్టిన కేంద్రం తాజా నిర్ణయాలతో రైల్వేల ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి సమాయత్తమైందని వ్యాఖ్యానించారు. ప్యాసింజరు రైళ్లను, రైల్వేస్టేషన్లను కూడా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన సాధికార గ్రూపును ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైల్వేలను పూర్తిగా వ్యాపారీకరిస్తే అది సామాన్యులకు ఎలా అందుబాటులోకి వస్తుందని రాజా ప్రశ్నించారు. రైల్వే ఉద్యోగం పొందాలన్న కల ఇక ముందు పూర్తి కలగానే వుండిపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే రైల్వేల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు రైల్వే ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్లు, ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని డి.రాజా పిలుపునిచ్చారు.
ఇకపై రైల్వేలు సామాన్యునికి దూరమేనా!
RELATED ARTICLES