వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన 370
ఆ ఆర్టికల్ రద్దు చారిత్రాత్మకం
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో రాజ్యాంగ అధికరణ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టిగా సమర్ధించుకున్నారు. ఈ ఆర్టికల్ వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదా న్ని పెంచిపోషించిందని, రాష్ట్రానికి కుటుంబపాలనను మోసుకువచ్చిందని, అంతకుమించి కశ్మీర్ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు. పైగా పాకిస్థాన్ ఈ అధికరణను టెర్రరిజం వ్యాప్తికి ఒక సాధనంగా వాడుకున్నదని ఆరోపించారు. రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోడీ తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. 370ను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. అంతేగాకుండా, జమ్మూకశ్మీర్‌లో, లడఖ్ (లద్దాఖ్) ప్రాంతంలో ఒక నవశకం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, అతల్‌బిహారీ వాజ్‌పేయి, సర్దార్ వల్లభాయ్ పటేల్‌తోపాటు కోట్లాది మంది ప్రజలు కన్న కల ఎట్టకేలకు సాకారమైందని మోడీ అన్నారు. ఆర్టికల్ 370 గానీ, ఆర్టికల్ 35ఎ గానీ కశ్మీర్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందో ఏ ఒక్కరూ సమర్ధించలేకపోయారని అన్నారు. ఈ అధికరణలు వేర్పాటువాదం, అవినీతి, ఉగ్రవాదం, కుటుంబపాలన తప్ప రాష్ట్రానికి ఇంకేమీ ఇవ్వలేకపోయాయన్నారు. ఇకపై కశ్మీర్ అభివృద్ధి కొత్త తీరాలకు చేరబోతున్నదని అన్నారు. “కశ్మీర్‌పై భిన్నాభిప్రాయాలను మేం గౌరవిస్తాం. దేశ ప్రయోజనాలకు ఇబ్బంది కలగనంతవరకు ప్రతిఒక్కరి అభిప్రాయాలూ గౌరవిస్తాం. పిడికెడు మంది కశ్మీర్లో పరిస్థితుల్ని దిగజార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పిడికెడు మంది ఆటలు సాగవు.. లక్షలాది మంది వారికి వ్యతిరేకంగా ఉన్నారు. కశ్మీరీ ప్రజల ప్రతి అవసరం తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి ప్రతిఒక్కరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. అక్కడి ప్రజల సుఖః దుఖాల్లో భాగం పంచుకొనేందుకు దేశం సిద్ధంగా ఉంది” అని మోడీ ప్రకటించారు. “పాకిస్థాన్ నుంచి కశ్మీర్కు వచ్చినవారికి ఎలాంటి హక్కులు లభించలేదు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ సంపూర్ణ హక్కులు లభించాయి.. కశ్మీర్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు జమ్మూకశ్మీర్లో గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు స్థానికులకు అన్నింట్లో సమ భాగస్వామ్యం లభిస్తుంది. కశ్మీర్లో కొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది. అభివృద్ధి కొత్త తీరాలకు చేరుతుంది. అక్కడి యువత నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కొత్త శాసనసభ్యులు, కొత్త ముఖ్యమంత్రులను మనం చూస్తాం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్ అద్భుత పరిపాలన అందిస్తున్నారు” అని మోదీ కొనియాడారు. “కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంచాలన్న నిర్ణయం తాలూకు ఫలితాలు త్వరలో కనిపిస్తాయి. పారదర్శకత, కొత్త పని విధానం అభివృద్ధికి బాటలు వేస్తుంది. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, నూతన రహదారులు వస్తాయి. కొత్త రైల్వే లైన్లు, విమానాశ్రయాలు వస్తాయి. లోక్సభ ఎన్నికల్లో కొన్ని కుటుంబాలు మాత్రమే పోటీ చేస్తుండేవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఎవర్నీ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చేవి కాదు” అన్నారు. “జమ్మూకశ్మీర్, లద్దాఖ్లో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. పర్యాటక రంగంలో కశ్మీర్ను అత్యున్నతస్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కశ్మీర్లో పర్యాటక రంగ పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుండేది. హిందీ, తెలుగు, తమిళం పరిశ్రమలను కశ్మీర్ వరకు తీసుకెళ్లాలి.