మరో ఆరుగురు సైతం
ఎసిబికి చిక్కిన కీలక ఫైళ్లు
కుప్పలు తెప్పలుగా నకిలీ బిల్లులు
స్కాం విలువ రూ.100 కోట్లకుపైనే
త్వరలో మరికొందరి అరెస్టు
కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఎసిబి
ప్రజాపక్షం/హైదరాబాద్: మందుల కోనుగోళ్ల కుంభకోణంలో ఇఎస్‌ఐ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్.దేవిక రాణితో పాటు మరో ఆరుగురిని ఎసిబి అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరందర్ని నాంపల్లిలోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితులపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం, ఫోర్జరీ, చీటింగ్, క్రిమినల్ కాన్సరెసి, విధులను దుర్వినియోగ పరచడం వంటి పలు సెక్షన్ల (120 (బి) రెడ్‌విత్ 34, 477 (ఎ) 465, 468, 471, 420) కింద కేసులు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఈ భారీ కుంభకోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిందితులను వారం రోజుల కస్టడీకి అప్పగించాలంటూ ఎసిబి అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనుంది. ఇఎస్‌ఐ మందుల కోనుగోళ్ల కుంభకోణంలో దేవికారాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దేవిక కార్యాలయంలో ఎసిబి అధికారులు జరిపిన తనికీల్లో కీలక పత్రాలు, సమాచారం లభించాయి.అవసరం లేకున్నా.. నకిలీ బిల్లులు సృష్టించి మందులు కొనుగోలు చేసి ఇఎస్‌ఐ అధికారులు భారీ కుంభకోణనికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎసిబి అధికారులు 17 మంది ఇఎస్‌ఐ అధికారుల ఇళ్లు, మరో నలుగురు ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, హైదరాబాద్‌లోని ఇఎస్‌ఐ ప్రధాన కార్యాలయం, వరంగల్‌లోని ఇఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో లభించిన 286 మెడికల్ ఎజెన్సీల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం పది డాక్యుమెంట్లను పరిశీలించగా రూ.12 కోట్ల కుంభకోణం వెలుగు చూసింది. మిగిలిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తే ఈకుంభకోణం విలువ రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.