HomeNewsBreaking Newsఇంద్రవెల్లిలో తొలిసభ

ఇంద్రవెల్లిలో తొలిసభ

ఈనెల 26 తరువాత జిల్లాల పర్యటన : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్‌ జిల్లాల పర్యటనలకు ఈ నెల 26 తరువాత వెళ్ళాలని, అందులో భాగంగా తొలి సభ ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. గతంలో టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలోనే తొలి భారీ సభను నిర్వహించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అక్కడే మొదటి సభను నిర్వహించి, లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కానున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు జిల్లాల వారీగా సమావేశాలను రేవంత్‌ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ భవనంలో తొలి రోజు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక తొలి బహిరంగ సభను ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎంఎల్‌ఎలు, నాయకులు ప్రతిపాదించారు. ఇందుకు అంగీకరించి అక్కడ ఇంద్రవెల్లి స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సిఎం సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని, 17 స్థానాలలో కనీసం 12 చోట్ల గెలుపొందే లక్ష్యంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎంఎల్‌ఎలకు వారంలో 3 రోజులు అందుబాటులో ఉంటా
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జ్‌ మంత్రులకు ఇచ్చామని, సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని సిఎం రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. తాను గత సిఎంలా కాదని, జనవరి 26 తరువాత ఎంఎల్‌ఎలకు అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. వారానికి మూడు రోజుల పాటు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎంఎల్‌ఎలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments