వలసకూలీల నమోదు ప్రక్రియ విషయంలో ప్రభుత్వాలపై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: వలసకూలీల నమోదు ప్రక్రియ ‘చాలా నెమ్మదిగా’ సాగుతోందని సుప్రీంకోర్టు అసంతృప్తి తెలియజేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో కార్మికులకు వివిధ పథకాల ప్రయోజనాలు వర్తింపచేయడాన్ని వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్రా ల ప్రభుత్వాలకు సూచించింది. ఇలా ఉంటే అసంఘటిత కార్మికుల నమోదు అంశంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు తనకు సంతృప్తికరంగా లేవని న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. వలసకూలీలు, అసంఘటిత కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిన అవసరాన్ని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎంఆర్ షా ధర్మాసనం నొక్కిచెప్పింది. కార్మికులను గుర్తించి, వారి వివరాలను నమోదుచేసిన తర్వాతే అధికారులు వారికోసం ఉద్దేశించిన పథకాలను వారికి విస్తరింపజేయాలని సూచించింది. వలసకూలీలు సహా లబ్ధిదారులందరికీ పథకాల ప్రయోజనం చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాలని పేర్కొంది. వలసకూలీలకు ఆహారభద్రత, నగదుబదిలీ, రవాణా సదుపాయం కల్పించేలా, ఇతర సంక్షేమ చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్తలు అంజలీ భరద్వాజ్, హర్ష్ మందెర్, జగ్‌దీప్ ఛోకర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణ చేసింది. కాగా దేశంలో వివిధ ప్రాంతాల్లో కొవిడ్ కట్టడి చర్యలు అమలుచేయడంతో వలసకూలీలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేవలం వలసకూలీలు, అసంఘటిత కార్మికులే కాకుండా సంఘటిత రంగంలో పనిచేసేవాళ్ల వివరాలు కూడా నమోదు చేయాలని ధర్మాసనం కోరింది. ఇది కష్టమైన పనే అయినా తప్పకుండా పూర్తిచేయాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. వారికి ఉద్దేశించిన ప్రయోజనాలు తప్పకుండా వారికి చేరాలన్నదే తమ ముఖ్య ఉద్దేశం అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒకవేళ కార్మికుల నమోదుకు యాజమాన్యాలు సహకరించకపోతే వారి లైసెన్సులు రద్దుచేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కూడా తెలిపింది. కాగా అసంఘటిత కార్మికుల జాతీయ స్థాయి డేటాబేస్ తయారుచేస్తామని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తనకు 2018లో చెప్పిందని, ప్రస్తుతం ఆ పని ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో న్యాయస్థానం సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని, వివరాలను తెలియజేస్తామని మెహతా బదులిచ్చారు. ఇదిలా ఉంటే గతేడాది ప్రారంభించిన ఆత్మ నిర్భర్ భారత్ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునః ప్రారంభించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. వలసకూలీలకు రేషన్ అందించాలని ఆయన సూచించారు.
నష్టపరిహారంపై నోటీసులు
కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పం దించిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కొవిడ్ కారణంగా చనిపోయినవారి మరణ ధ్రువీకరణ పత్రాల జారీ లో ఒకే విధానం అమలు జరుగుతున్నదా? లేదా? అని ప్రశ్నించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద కరోనాతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. లక్ష చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరు తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో కేంద్రాన్ని పలు అంశాలపై నిలదీసింది. కొవిడ్ చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రాలను ఏ విధంగా జారీ చేస్తున్నారని ధర్మాసనం అడిగింది. ఒకే విధానాన్ని అమలు చేయకపోతే, కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించినా అది ఆయా కుటుంబాలకు చేరే అవకాశాలు ఉండవని స్పష్టం చేసింది. ఈవిషయంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించాలని సూచిస్తూ, తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది.
ఇంత తాత్సారమా?

RELATED ARTICLES