తమ్ముడు మృతి, అక్కకు తీవ్ర గాయాలు
ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
ప్రజాపక్షం/రంగారెడ్డి ప్రతినిధి/హయత్ నగర్ ఎల్.బి నగర్ పరిధిలోని ఆర్‌టిసి కాలనీ ఓ ఇంట్లోకి శివకుమార్ అనే యువకుడు చొరబడి.. ఓ యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు.ఈ దాడిలో యువకుడు మృతి చెందగా, అతని సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల తన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఆర్.టి సి కాలనీలోని సంఘవి ఇంటికి రామంతపూర్‌కి చెందిన శివకుమార్ వచ్చాడు.ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు పృధ్వి (చింటూ) ఉన్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి తర్వాత పృధ్వి (చింటూ), ప్రేమోన్మాది శివకుమార్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.దీంతో శివకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.ఈ క్రమంలోనే గొడవ జరిగి కిటికీ అద్దాలు పగులగొట్టిన శబ్ధం రావడంతో… స్థానికులు అక్కడికి చేరుకుని దాడికి పాల్పడిన నిందితుడిని ఇంట్లోనే బం ధించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సంఘవి, చింటూలను స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చింటూ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సంఘవిని మెరుగైన చికిత్సకోసం అక్కడినుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రేమోన్మాది శివకుమార్‌ని అదుపులోకి తీసుకుని ఎల్. బి నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం
దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం.గాయపడిన చింటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కత్తిపోట్లకు గురైన యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించాం.నిందితుడు శివకుమార్‌ను విచారిస్తే దాడికి కారణంతెలుస్తుంది.
ఎల్.బి నగర్ డిసిపి సాయిశ్రీ