కనీస మార్కులు వేసి పాస్ చేస్తాం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన
విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనతో ప్రభుత్వం చర్యలు
సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించిన సిపిఐ
ప్రజాపక్షం / హైదరాబాద్ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరికీ కనీస మార్కులు వేసి పాస్ చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇటీవల ఇంటర్ ఫస్ట్‌ఇయర్ ఫలితాల్లో కేవలం 49 శాతమే ఉత్తీర్ణత సాధించడంపై విద్యార్థి సం ఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన కార్యాయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకుని, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులందరికీ కనీసం 35 మార్కులు ఇచ్చి అందిరినీ పాస్ చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మంచి మార్కులు సాధించాలని, ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండియర్‌లో కూడా పాస్ చేస్తారని ఆశించవద్దని స్పష్టం చేశారు.
బోర్డు, ప్రభుత్వాన్ని నిందించడం బాధాకరం :
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, నెల రోజులు సమయమిచ్చి పరీక్షలు నిర్వహిస్తే 4.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో 49 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, 51 శాతం ఫెయిల్ అయ్యారని తెలిపారు. విద్యార్థులకు ప్రిపేర్ అయ్యేందుకు సరిపడ సమయం ఇవ్వలేదనడం, డిజిటల్, ఆన్‌లైన్ తరగతులు చూడలేకపోయారని అనడం సరికాదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో కూడా 10వేల మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించారని వెల్లడించారు. ఇంటర్ ఉత్తీర్ణత శాతం 2014లో 59 , 2015లో 51, 2016లో 62, 2017లో 66, 2018లో 67, 2019లో 65, 2020లో 68 శాతం నమోదైందన్నారు. ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందించడం, ప్రభుత్వాన్ని నిందించడం బాధాకరమన్నారు. పిల్లల కెరియర్ ముఖ్యమని, వారు భవిష్యత్తులో పోటీ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, కాబట్టి పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో కూడా 70 శాతం మాత్రమే సిలబస్ ఇచ్చామని, ఆప్షన్స్ కూడా ఇచ్చామన్నారు. ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరరమని, పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఫస్టియర్ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొదని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. “కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం. దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించాం. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమన్వయం సాధించాం. 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశాం. విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య చాలా కీలకం. 620 గురుకులలాను, 172 కస్తూర్బా కళాశాలలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేశామ’ని మంత్రి వివరించారు.ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. టీ-శాట్, దూరదర్శన్ వెబ్‌సైట్‌ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచామన్నారు.
స్వాగతిస్తున్నాం : సిపిఐ
ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ స్వాగతిస్తుంది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు జరిగిన అన్యాయం, తల్లిదండ్రుల ఆవేదన, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థి సంఘాల నేపథ్యంలో ప్రభుత్వం సముచితంగా స్పందించిందని పేర్కొన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకొని మరణించిన ఫెయిలైన విద్యార్థుల కుటుంబాలకు కూడా మానవతాదృక్పధంతో తగు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.