తల్లిదండ్రుల ఆగ్రహావేశాలు
విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ధర్నా
బోర్డు ప్రాంగణంలో ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకవతకలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెల్లుబికింది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నేతలు సోమవారం ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇంటర్‌బోర్డు అధికారుల తీరుపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంటర్‌బోర్డు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ధర్నాలు, బైళాయింపులు, అరెస్టులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇప్పటికే దాదాపు 12 మంది వి ద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడంతో తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టులు తెంచుకుంది. అధికారు ల తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. బిసి విద్యార్థి సంఘా లు, ఎబివిపి, కాంగ్రెస్, బిజెపి నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోలీసులు వారిని అడ్డుకొని అరె స్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారుల తప్పిదాలు, పొరపాట్ల వల్ల ప్రతిభావం తులైన తమ పిల్లలను ఫెయిల్ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం నుండే వందల సంఖ్యలో ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని చుట్టి ముట్టి ధర్నాలు, ఆందోళనలు చేయడంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. విద్యార్థుల తల్లిదండ్రులే కాకుడా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు సైతం విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావంగా ధర్నాలకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. అరెస్టులకు తెరలేపారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని అయి నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 90 శాతానికి పైగా మార్చులు తెచ్చుకు న్న విద్యార్థులను సైతం ఇంటర్ బోర్డు ఫెయిల్ చేయడం పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. పరీక్షా పత్రాల మూల్యాంకనం అంతా తప్పుల తడకగా ఉందని, మూల్యాంకనం చేసిన తర్వాత విద్యార్థులకు వచ్చిన మార్కులను వారి జాబితాల్లో పొందుపర్చేందుకు చేపట్టే కోడింగ్, డీకోడింగ్‌లో తప్పిదాలు విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయని వారు మండిపడ్డారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెయ్యికి 900లకు పైగా మార్కులు వచ్చిన టాపర్లు కూడా ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు వరుసగా గత రెండు మూడు రోజుల నుండి ఇంటర్ బోర్డుకు వద్ద అధికారుల ఘెరావ్, ముట్టడికి పాల్పడుతున్నారు. విద్యార్థులకు న్యాయం చేశాయని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కూడా నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఇయర్‌లో 90 శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ కావడం ఏంటీ? పరీక్షా పత్రాలను సరిగ్గానే వాల్యుయేషన్ చేశారా? తమకు ఆన్షర్ షీట్లను చూపండంటూ బోర్డు కార్యాలయం ముందు ధర్నాలు, అధికారుల ఘెరావ్‌లు చేయడంతో ఇంటర్ బోర్డు పరిసరాలన్నీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో శాస్త్రీయత కొరవడిందని , గతంలో మూల్యాంకనం సరిగ్గా నిర్వహించి విద్యార్థులకు సరైన మార్కులు వేసేవారని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. మూల్యాంకనం అనంతరం కోడింగ్, డీ కోడిండ్, జంబ్లింగ్ లాంటి విషయాల్లో మూల్యాంకనం నిర్వహించిన అధ్యాపకులు సరైన విధంగానే చేశారా? లేదా ఒకరి మార్కులు మరొకరికి మారాయా? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డు కార్యాలయాన్ని చుట్టు ముట్టారు. ఒక పక్క విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతుండగానే మరో వైపు రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు చర్యలను తూర్పారబడుతూ నాంపల్లి బోర్డు పరిసరాల్లో ధర్నాలు, ఆందోళనలు చేపట్టడంతో ట్రాఫిక్ స్థంభించింది. విద్యార్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలుఎ.రేవంత్‌రెడ్డి, సంపత్ కుమార్‌తో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.అనిల్ కుమార్ యాదవ్‌లు ఇంటర్ బోర్డు ముందు బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలు బలవంతంగా అరెస్టు చేసి యత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణాలు ఇవే!
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కరిమల ఇంటర్ కళాశాల విద్యార్థిని గజ్జి నవ్వకు ఇంటర్ సెకండియర్ తెలుగు పేపర్-2లో సున్నా మార్కులు వేసిన ఇంటర్ బోర్డు ఒక్క రోజు తర్వాత అవి 99 మార్కులుగా సవరించి పాస్ చేసింది. అన్ని సబ్జక్టుల్లో 95కు పైగా మార్కులు వచ్చిన ఆ విద్యార్థినికి తెలుగులో సున్నా రావడంతో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం అనుమానాలను వ్యక్తం చేయగా ఈ మేరకు ఇంటర్ బోర్డు సవరించి మార్కులను 99గా ప్రకటించింది. కాగా ఫస్ట్ ఇయర్‌లో అన్ని సబ్జక్టుల్లో పాసయి, సెకండ్ ఇయర్ లోనూ అన్ని సబ్జక్టులు పాసైన మరో విద్యార్థికి ఫలితాల మెమోలో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినట్లు చూడపం ఇంటర్ బోర్డు తప్పులను మరో సారి ఎత్తి చూపింది. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చోటుచేసుకున్నాయో నంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డులను చుట్టుముట్టడంతో ఇంటర్ బోర్డు ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
నవ్య మార్కులు సరి చేశాం.. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి
నవ్య అనే విద్యార్థినికి సెకండ్ ఇయర్ తెలుగులో జీరో మార్కులు వచ్చాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశాం. పేపర్ మూల్యాంకలనంలోనూ పొరపాట్లు ఉంటే బాధ్యులపై చర్యలు తప్పవు. ఇప్పటికే మార్కుల పొరపాట్లపై టెక్నికల్ కమిటీ వేశాం. మూడు రోజుల్లో నివేదిక వస్తుంది. ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయడం కుదరదు. తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్నాము. ఏజెన్సీ పొరపాటు ఉంటే చర్యలు తప్పవు. విద్యార్థుల ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. అవసరం అనుకుంటే రీ వాల్యుయేషన్ దరఖాస్తు గడవు పొడగిస్తాం.
అరెస్టులను ఖండించిన లక్ష్మణ్
ఇంటర్ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డ్ వైఫల్యాలను నిరసిస్తూ బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తే, నిరసన తెలపడానికి కూడా కనీస అవకాశం ఇవ్వకుండా పోలీసులు బీజేవైఎం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారని బిజెపి రాష్ట్ర అద్యక్షలు లక్ష్మణ్ ఖండించారు. ఒక అధినేత మెప్పు కోసం పోలీసులు అత్యుత్సాహంతో కొందరిని తీవ్ర గాయాలయ్యేలా, మరికొందరినిపైకి కనిపించని గాయాలయ్యేలా కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు.
12 మంది చావుకు కారణమైన అధికారులను తొలగించాలి
ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళం, అక్రమాల వల్ల 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు కారకులైన ఇంటర్ బోర్డు అధికారులను ఉద్యోగాల నుండి తొలగించాలని బిసి విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, జి.అంజి, నందగోపాల్, వేముల రామకృష్ణతో సహా అనేకమంది విద్యార్థులు ఇంటర్‌బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బిసి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
రేవంత్‌రెడ్డి మెరుపు ధర్నా
ఇంటర్‌బోర్డు వైఫల్యాలపై ఇంటర్‌బోర్డు కార్యా లయం ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం మెరుపు ధర్నాకు దిగారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి సంపత్‌కుమార్, యువజన కాంగ్రె స్ రాష్ట్ర అద్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజారు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డిని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, మధు యాష్కీగౌడ్, మల్లు రవి, తదితరులు పరామర్శించారు. ఎబివిపి ధర్నాః ఎబివిసి ఆధ్వర్యంలో నిరసన ఇంటర్ పరీక్షల నిర్వ హణలో రాష్ట్ర ప్రభుత్వం,ఇంటర్మీడియట్ బోర్డ్ వైఫల్యాలను నిరసిస్తూ బిజె పి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెవైఎం కార్యకర్తలు బోర్డు కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న బిజెవైఎం నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.