కెసిఆర్ సమాధానం చెప్పాల్సిన రోజు తప్పక వస్తుంది
అఖిలపక్ష పార్టీల నేతలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించి విడుదల చేసిన అస్తవ్యస్థ ఫలితాల వల్ల 26 మంది విద్యార్థు లు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాల్సిన రోజు తప్పకుండా వస్తుందని అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు అన్నారు. ముఖ్యమంత్రి స్పందించక పోతే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ దృష్టికి కూడా తీసుకెళ్తామని వారు ముక్తకంఠంతో హెచ్చరించారు. ఆత్మహత్యల కుటుంబాలను ఆదుకునే వరకు కొస దాకా కొట్లాడుతామని, ఇందుకు తెలంగాణ ఉద్యమమే తమకు స్ఫూర్తి అని వారు నినదించారు. ఇంటర్‌బోర్డు వైఫల్యాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సెమినార్‌ను నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు, మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఇంటర్ బోర్డువి తప్పుల మీద తప్పులే : చాడ వెంకట రెడ్డి (సిపిఐ రాష్ట్ర కార్యదర్శి)
గతంలో ఎన్నడూ లేని విధంగా 26 మంది విద్యార్థులు ఈ సారి ఆత్మహత్యకు పాల్పడడం చూస్తుంటే ఇంటర్ మూల్యాంకనంలో చోటు చేసుకున్న దోషాలు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. ఇందుకు విద్యాశాఖ మంత్రిజగదీశ్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. గ్లోబరీనా కంపెనీ నిర్యాకాన్ని కూడా త్రిసభ్య కమిటి ఎత్తి చూపిందన్నారు. ఒక పక్క 26 మంది పిల్లలు చనిపోయి ఆ కుటుంబాలు దుఖంలో ఉంటే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాత్రం అత్యంత బాధ్యతా రహితమైన స్టెట్‌మెంట్లు ఇస్తున్నారని, ఫలితాలు వచ్చిన ప్రతి సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కొత్తేమీ కాదని చెప్పడం ఆయనలోని అహంభావాన్ని ఎత్తి చూపిస్తోందన్నారు. ఇంటర్ ఫలితాల విషయంలో పారదర్శకంగా ఉండాలని హైకోర్టు ఇప్పటికే చెప్పినా బోర్డు నిర్లక్ష్య వైఖరితోనే ఉందని, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందన్నారు. ధర్నా చౌక్ సాధనకు ఢిల్లీ వరకు వెళ్లి పోరాడి సాధించుకున్నామని, ఇప్పడు ఇంటర్ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై గురువారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించనుందని, ఈ తీర్పు పరిశీలించాక భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చాడ వెల్లడించారు.