ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. మొదట బ్యాటర్లు మెరవగా, తర్వాత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్ల్‌ండ 214 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా కెప్టెన్, గత మ్యాచ్ సెంచరీ హీరో రోహిత్ శర్మ (1) త్వరగానే నిష్క్రమించినా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ వికెట్ కాపాడుకుంటూనే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిన గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 పరుగులు చేశాడు. వీరి తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (64 బంతుల్లో 78), కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40) వేగంగా ఆడడంతో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా కదిలింది. అనంతరం 357 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్ల్‌ండ తడబడింది. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టామ్ బాంటన్ (38), ఆట్కిన్సన్ (38) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు సాధించారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23), బెన్ డకెట్ (34) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్ల్‌ండ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌కు ఒక్కో వికెట్ దక్కింది.