రేపే ఓట్ల లెక్కింపు
అందరి చూపు స్ట్రాంగ్‌రూమ్‌ల వైపే..
ప్రజాపక్షం/హైదరాబాద్ : మూడు మాసాలుగా చేస్తున్న ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ తుది అంకం కానుండడంతో కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ అనంతరం ఇవిఎం, వివి ప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన విషయం తెలిసిందే. అటు ఇటుగా మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అయితే ఈ స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద సాయుధ దళాల పహారా ఉన్నప్పటికీ విపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. సెక్యూరిటీ నామమాత్రంగానే ఉందని, అందుకే పలు అనుమానాలు కలుగు తున్నాయని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచినా పోలింగ్ శాతం వెల్లడించడంలో ఇసి వైఫల్యం చెందడంపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ సిఎం కెసిఆర్‌పై పోటీ చేసిన ప్రజాఫ్రంట్ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి సైతం సిఇఒ రజత్ కుమార్‌ను కలిసి పోలింగ్ శాతం ప్రకటించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ 24 గంటల్లో ఇవిఎంలను ఇంకా ఎలా వాడుకున్నారో.. అందుకే కౌంటింగ్‌లో పోలైన ఇవిఎం పోల్ చిట్టీలను లెక్కించాలని కోరుతున్నామని ఆయన మీడియా ముఖంగానే ఇసికి డిమాండ్ చేయడం గమనార్హం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కోసం అన్ని జిల్లాల్లో ఇసి ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని 12 నియోజక వర్గాలను 15 చోట్ల లెక్కిస్తున్నారు. సిఎం కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ ఓట్ల లెక్కింపు, అదే విధంగా సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకట రెడ్డి పోటీ చేస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజక వర్గ ఓట్ల లెక్కింపును ఇందూరు ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ సిద్దిపేటలో నిర్వహించనున్నారు. టి పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ పోటీ చేస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గం ఓట్లను సూర్యాపేటలోని ఎఎంసి గోదాంలో కౌటింగ్ చేయనున్నారు. టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కోడంగల్ ఓట్లను వికారాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ గోదాంలోనూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పోటీ చేస్తున్న ముషీరాబాద్ ఓట్లను , అలాగే ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్న చాంద్రాయణగుట్ట నియోజక వర్గం కౌంటింగ్‌ను నిజాం కాలేజీలోనూ రేపు లెక్కించనున్నారు.
మూడంచెల భద్రత అంటున్న ఇసి
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగే కౌటింగ్‌కు మూడెంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఇసి చెబుతోంది. స్ట్రాంగ్ రూమ్‌లన్నింటిని సిసి కెమెరా నిఘాలో ఉంచినట్లు తెలియజేస్తోంది. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు సిబ్బందికి తొలి విడత శిక్షణ కూడా పూర్తి చేసింది. రెండో విడత శిక్షణను మరో సారి సోమవారం నాడు నిర్వహించనుంది. అలాగే పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలోనే ఓట్లు లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేపత్యేక, ప్రతి టేపతి వద్ద ఒక సూబర్ వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్‌లను ఏర్పాటు చేయనుంది. అలాగే కౌటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, పాస్‌లు జారీ చేస్తారు. కౌంటింగ్ సందర్భంగా పార్టీల గెలుపోటముల నేపథ్యంలో ఎజెంట్లు సత్ప్రవర్తన కల్గిన వారై ఉండాల్సి ఉంటుందని ఈసి నిర్దేశించింది. కౌంటింగ్ సమాచారం బయటికి వెళ్లకుండా కూడా ఈసి జాగ్రత్త వహిస్తోంది. అభ్యర్థులు, కౌంటింగ్ ఎజెంట్లు, సిబ్బంది ఫోన్లు, అలాగే కౌంటింగ్ పేపర్లపై నిఘా ఉంచనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్‌లోకి తీసుకురాకుండా ఒక చోట డిపాజిట్ చేయనున్నారు. మొదటి అరగంటలోనే పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాకే ఇతర ఈవిఎంల ఓట్లు లెక్కించాలని ఈసి ఆదేశాలు జారీ చేసింది.