బిసి రిజర్వేషన్ల ఖరారుపై అధికారుల్లోనే గందరగోళం
విడుదల కాని మార్గదర్శకాలు
డిపిఒలు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ కమిషనర్ దిశానిర్దేశం
ఓటర్ల, బిసిల జాబితాలు లేకుండానే హాజరైన డిపిఒలు
ప్రజాపక్షం / హైదరాబాద్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓ వైపు సమయం సమీపిస్తోంది. వీటి నిర్వహణలో ముందుకు పోవడంలో అత్యంత కీలకమైన బిసి రిజర్వేషన్ల ప్రక్రియలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని ఎలా ఖరారు చేయాలనే దానిపై మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటివరకు జారీచేయకపోవడమే దీనికి కారణం. దీంతో మార్గదర్శకాలు ఎలా వస్తాయి, జిల్లా, మండల, పంచాయతీ స్థాయిల్లో బిసి రిజర్వేషన్లను ఎలా కేటాయించాలన్న దానిపై మార్గదర్శకాలు వస్తే కాని రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కాని పరిస్థితి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 29లోగా బిసి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖకు స్పష్టం చేసింది. విధా నం తెలిస్తే… దానిని బట్టి చేయాలి, దాని ప్రకారం పంచాయతీ స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఎంత సమయం పడుతుందో, ఏ లెక్కన బిసిలకు కేటాయించాలన్నదే అసలు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ శుక్రవారం హైదరబాద్ కమిషనరేట్ కార్యాలయంలో అన్ని జిల్లా పంచాయతీ అధికారులను పిలిపించి రిజర్వేషన్ల ప్రక్రియపై వారికి వివరించింది.మార్గదర్శకాలు ఫలానా విధంగా ఉండొచ్చనే అంచనాతో రెండు, మూడు రకాల పద్ధతులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె వివరించారు. మార్గదర్శకాలు వెలువడిన వెంటనే యుద్ధప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంతగా వివరించినప్పటికీ తక్కువ సమయంలో రిజర్వేషన్ల ఖరారు సాధ్యం కాదనే అభిప్రాయమే మెజార్టీ డిపిఒల్లో వ్యక్తమైంది. కారణం ఇప్పటికే అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారం పంచాయతీల ఓటర్ల జాబితా, బిసిల ఓటర్ల జాబితా తయారు చేయాలని చెప్పి చాలా రోజులవుతోంది. అయినప్పటికీ ఈ జాబితాల తయారీ రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలో కూడా కొలిక్కిరాలేదు. నిజానికి శుక్రవారం నాటి సమావేశానికి ఈ జాబితాలతో డిపిఒలు రావాలని నీతూప్రసాద్ ఆదేశించారు. ఒక్క డిపిఒ కూడా వాటిని తీసుకురాకపోగా ఇంకా సిద్ధమే కాలేదని చెప్పడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.