సిఎం కెసిఆర్‌కు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ సవాల్
హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం
నేడు ఇందిరా పార్క్ వద్ద భట్టి విక్రమార్క దీక్ష.. అనుమతి ఇవ్వకుంటే స్పీకర్ ఇంటి ముందు..
ప్రజాపక్షం/హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు దమ్ముంటే టిఆర్‌ఎస్‌లో కలుపుకున్న 12మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలతో రాజీనా మా చేయించాలని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సవాలు విసిరారు. ఎంఎల్‌ఎల విలీనంపై సోమవారం నాడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని, గతంలో వేసిన పిటిష న్ ఈనెల 11న విచారణకు రానున్నదని తెలిపా రు. అలాగే పార్టీ ఫిరాయించిన వారిపై లోక్‌పాల్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అక్రమ విలీనంపై సి ఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం ఉదయం 11 గంటల నుండి ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేస్తారని, ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే స్పీకర్ ఇంటి వద్ద చేస్తారని చెప్పారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆర్.సి. కుంటియా, మల్లు భట్టి విక్రమార్క, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీతో కలిసి ఏర్పాటుచేసిన మీ డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్‌లో 12 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు చేరారనేది వాస్తవం కాదని, వారు గత నాలుగు నెలల నుండి వేర్వేరు తేదీలలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారని అన్నారు. రోహిత్‌రెడ్డి మిన హా మిగతా 11 మందిపై ఎప్పటికప్పుడు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చామన్నారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యా దు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఏలు మరో లేఖను స్పీకర్‌కు ఇచ్చే హక్కు లేదని ఉత్తమ్ అన్నారు. అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉండగా స్పీకర్ వారి నుండి ఇంకో వినతి తీసుకోవటానికి వీలు లేదన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ పదవికే అప్రదిష్ఠ తీసుకువచ్చారని, ముఖ్యమంత్రి ఇంటికి ఒక స్పీకర్ వెళ్తారా? అని ప్రశ్నించారు.గతంలో అనర్హత పిటిషన్‌లు ఇస్తామనే భయంతో ఆయన హైదరాబాద్‌కు రావడమే మానేశారని, దీంతో సిఎల్‌పి నేత భట్టి బాన్స్‌వాడకు వెళ్ళి మరీ వాటిని ఇచ్చివచ్చారని, ఆ సందర్భంలో కనీసం ఫోటో దిగేందుకు కూడా భయపడ్డారని విమర్శించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇది తగునా? ఇంత దిగజారి ప్రవర్తిస్తారా? అన ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకించిన ఎంఐఎం, జగన్ ఇప్పుడుకెసిఆర్‌కు దోస్తులుగా మారారని,తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ దుష్మన్‌గా మారిందన్నారు.కుంటియా మాట్లాడుతూ తెలంగాణ డిక్టేటర్ షిప్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. కెసిఆర్ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఎంఎల్‌ఏలను కొనుగులో చేసి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని, ఇది అప్రజాస్వామిక చర్య అని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే తనకు ఎప్పటికైనా ముప్పు అనే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంఎల్‌ఏలు ఏ పార్టీలో చేరాలనుకునేది వారి ఇష్టమని, అయితే చేరేందుకు ముందు కాంగ్రెస్ సింబల్‌పై గెలిచిన ఎంఎల్‌ఏలు తమ పదవికి రాజీనామా చేయాలన్నారు. అసెంబ్లీ లో ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.దళిత నాయకుడు సిఎల్‌పి నాయకుడిగా ఉండటం కెసిఆర్‌కు ఇష్టం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా దళిత నాయకున్ని కెసిఆర్ చూడలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఉండొద్దని కెసిఆర్ భావిస్తున్నారని, ఎంఎల్‌ఏల ఫిరాయింపుపై స్పీకర్, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.