HomeNewsLatest Newsఆ బాధ్యత మాది కాదు

ఆ బాధ్యత మాది కాదు

ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతిపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ
ఢిల్లీ పోలీసులే నిర్ణయించాలని సూచన
ఎవరి అధికారాలు ఏవో చెప్పాల్సిన అవసరం లేదు
ప్రదర్శన మా రాజ్యాంగ హక్కు: రైతు సంఘాలు
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా నిరసన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం నాడు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ “శాంతిభద్రతలకు” సంబంధించిందని, దేశ రాజధానిలోకి ఎవరిని అనుమతించాలి అన్నది నిర్ణయించాల్సింది ఢిల్లీ పోలీసులేనని సుప్రీం కోర్టు సోమవారం నాడు కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందువల్ల ట్రాక్టర్‌ ర్యాలీ నిలిపివేతకు సంబంధించిన దరఖాస్తును ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంలో అంతి మ నిర్ణయం పోలీసులదే అని తేల్చి చెప్పింది. “పోలీసుల అధికారాలు ఏంటి, వాటిని ఎలా నిర్వర్తించాలన్నది సుప్రీం కోర్టు చెప్పాలా? మీరేం చేయాలో మేము చెప్పదలుచుకోలేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు ఎల్‌. ఎన్‌.రావు, వినీత్‌ శరణ్‌ ఇందులో ఇతర సభ్యులు. ఈ అంశంపై తదుపరి విచారణ బుధవారం (20వ తేదీన) ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌కు సూ చించింది. ఢిల్లీలోకి ప్రవేశించడం అన్నది శాంతిభద్రతలకు సంబంధించింది. దానిని పోలీసులే నిర్ణయించాలని, వారి అధికారాల విషయంలో తామే మీ చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. రైతులు ప్రతిపాదించిన ట్రాక్టర్‌ ర్యాలీ, లేదా నిరసన గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించేదిగా ఉం టుందని కేంద్రం ఢిల్లీ పోలీసుల ద్వారా సుప్రీం కోర్టులో అర్జీ పెట్టించిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం, రైతులకు మధ్య ప్రతిష్టంభన తొలగించేందుకు సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌లో మిగిలిన ముగ్గురు సభ్యులను తొలగించాలన్న వ్యాజ్యం విచారణను కూడా న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు భూపీందర్‌ సింగ్‌ మాన్‌ ఈ కమిటీ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. మిగిలిన ముగ్గురు సభ్యులు ప్రమోద్‌ కుమార్‌ జోశీ, అశోక్‌ గులాటీ, అనిల్‌ ఘన్వట్‌. కొత్త వ్యవసాయ చట్టాలను స్వాగతించిన కారణంగాఈ ముగ్గురినీ తొలగించాలని రైతులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.
ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మాత్రమే…
శాంతియుత ట్రాక్టర్‌ ర్యాలీ తమ రాజ్యాంగబద్ధమైన హక్కు అని రైతు సంఘాలు సోమవారం పేర్కొన్నాయి. ఇంకా ఈ నెల 26న జరిగే ప్రతిపాదిత కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొంటారని స్పష్టం చేశాయి. రైతులు రాజ్‌పథ్‌లోనో, లేదా ఇతర అత్యంత భద్రత ఉన్న ప్రాంతాల్లోనో ర్యాలీ చేపట్టడం లేదని, కేవలం ఢిల్లీ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మాత్రమే ప్రదర్శన ఉంటుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లఖోవాల్‌) పంజాబ్‌ విభాగం ప్రధాన కార్యదర్శి పరమ్‌జీత్‌ సింగ్‌ వెల్లడించారు. కాబట్టి గణతంత్ర దినోత్సవ పెరేడ్‌ను అడ్డుకోవడం అన్న ప్రశ్నే లేదని ఆయన వ్యాఖ్యానించారు. జనవరి 26న ఢిల్లీ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించిన తర్వాత రైతులు మళ్లీ నిరసన స్థలాలకే వస్తారని పంజాబ్‌ ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడు లఖ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. “ప్రభుత్వం ఉన్న ఏ ప్రదేశం దగ్గరికీ మేము వెళ్లడం లేదు. పైగా ట్రాక్టర్లన్నీ జాతీయ జెండాలు, రైతు సంఘాల జెండాలతో ర్యాలీలో పాల్గొంటాయి” అని లఖ్‌బీర్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఢిల్లీ పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే… అన్న ప్రశ్నకు, శాంతియుత ర్యాలీ రైతుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రహన్‌) అధ్యక్షుడు జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌ బదులిచ్చారు. ఒకవేళ శాంతిభద్రతల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు అనుమతించకపోతే సంయుక్త కిసాన్‌ మోర్చాతో కలసి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని సింగ్‌ తెలిపారు. అయితే జనవరి 26 నాడు దేశ రాజధానిలో ట్రాక్టర్‌ ర్యాలీ తీయడం ఖాయం అని ఉగ్రహన్‌ పిటిఐకి తెలిపారు.
పదో విడత చర్చలు ఈరోజే
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది రైతులు, ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందినవాళ్లు నవంబర్‌ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య పదో విడత చర్చలు మంగళవారం జరగనున్నాయి. ఇంకా ప్రభుత్వం, రైతులకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ కూడా మంగళవారం తొలి సమావేశం జరపనుందని కమిటీ సభ్యుడు అనిల్‌ ఘన్వట్‌ తెలిపారు. కేవలం కమిటీ సభ్యుల మధ్య మాత్రమే జరిగే ఈ సమావేశానికి ఢిల్లీలోని పుసా ప్రాంగణం వేదిక కానుంది. ఇందులో భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చించనున్నామని ఘన్వట్‌ వెల్లడించారు. ఈ కమిటీ కొత్త సాగు చట్టాలకు మద్దతిస్తున్న, వ్యతిరేకిస్తున్న దేశవ్యాప్త రైతుల అభిప్రాయాలను విని, రెండు నెలల్లో ఒక నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించనుంది. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌కే అన్నదాతలు అంటిపెట్టుకోవడంతో ప్రభుత్వానికి, 41 రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు జరిగిన 9 విడతల చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చట్టాల అమలుపై సుప్రీం కోర్టు ఈ నెల 12న స్టే విధించింది. రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు నలుగురు సభ్యుల సంఘాన్ని నియమించింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments