కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలవుతాయనేది సర్వత్రా ఆసక్తి
మా ఓట్లు మాకే వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్
తమ వైపే మొగ్గు చూపుతారని టిఆర్‌ఎస్ ధీమా
ప్రజాపక్షం/హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఆ ‘పది శాసనసభ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఎన్నికైన కేవలం మూడు నెలల్లో కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎంఎల్‌ఎల నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలవుతాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, వారంతా ప్రజాభిష్ఠానికి భిన్నంగా టిఆర్‌ఎస్‌లో చేరారని, పార్టీ ఫిరాయింపులను ప్రజలు ఎవగింపు చేసుకుంటున్నారని, టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు పడుతాయని కాం గ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఇటీవల ‘కారు’ ఎక్కుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు తిరిగి కాంగ్రెస్ పోలవుతాయని భావిస్తుంటే, టిఆర్‌ఎస్ మాత్రం తమ వైపే మొగ్గు చూపుతారని భావిస్తుంది. ఎల్లారెడ్డి ఎంఎల్‌ఎ జాజుల సురేందర్‌కు దాదా పు 34వేల పైచిలుకు మె జార్టీ రాగా, పినపాక ఎంఎల్ ఎ రేగ కాంతారావుకు 20 వేల పైచిలుకు, ఎల్‌బినగర్ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డికి 17వేల పైచిలుకు, కొల్లాపూర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డికి 12వేల పైచిలుకు, మహేశ్వరం ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డికి 9వేల పైచిలుకలు, నకిరేకల్ ఎంఎల్‌ఎ చిరుమూర్తి లింగయ్యకు 8వేలు, పాలేరు ఎంఎల్‌ఎ కందాల ఉపేందర్ రెడ్డికి 7వేలు, కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనం వెంకటేశ్వరరావుకు 4వేలు, ఆసిఫాబాద్ ఎంఎల్‌ఎ ఆత్రంసక్కు 170 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఎంఎల్‌ఎలు పార్టీ మారినంత మాత్రాన వారి నియోజకవర్గ ఓట్లు కూడా వారితో పాటే మారుతాయా..? లేదా మరోసారి వ్యతిరేకంగా పోలవుతాయా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గత ఎన్నికల్లో ఆ పది మంది ఎంఎల్‌ఏలకు ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగానే ప్రజలు పట్టం గట్టారని, కాబట్టి ఈ సారి ఆ ఓటర్లు తమవైపే ఉంటారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం వెనుక టిఆర్‌ఎస్ నియంతృత్వం, ఫిరాయింపుల పట్ల ప్రజల వ్యతిరేకతే కారణమని, కాబట్టి తమకు తప్పకుండా పది నియోజకవర్గాల్లో ఓటర్లు అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నాయి.