టిఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ ఎంఎల్‌సిలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, దామోదర్‌రెడ్డి, ప్రభాకర్ రావు
టిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలుగా గుర్తించాలని స్వామిగౌడ్‌కు లేఖ
విలీనం గుర్తిస్తూ క్షణాల్లోనే బులెటిన్ జారీ
ప్రజాపక్షం/హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మరోసారి విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఇద్దరు స్వతంత్ర ఎంఎల్‌ఎలను తమవైపు తిప్పుకున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ తాజాగా శుక్రవారం మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్‌సిలను తమ వైపు మలుపుకుంది. దీంతో ఏకంగా శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్నే టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో విలీనం అయ్యేలా చేసింది. గురువారం సాయం త్రం టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎంఎల్‌సిలు ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్ టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. గతంలో టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎంఎల్‌సిలు ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డిలతో పాటు వారిరువురు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్‌ను ఆయన కార్యాలయంలో కలిసారు. సిఎల్‌పి (కాంగ్రెస్ శాసనసభాపక్షం)ను టిఆర్‌ఎస్‌ఎల్‌పి (టిఆర్‌ఎస్ శాసనసభాపక్షం)లో విలీనం చేయాలని, తమను టిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలుగా గుర్తించాలని కోరుతూ స్వామిగౌడ్‌కు ఆ నలుగురు ఎం ఎల్‌సిలు లేఖను అందజేశారు. ఈ నెల 20వ తేదీన శాసనమండలి ప్రాంగణంలో జరిగిన సిఎల్‌పి సమావేశంలో తామం తా టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం కావాలని నిర్ణయించామని, భారత రాజ్యాంగం పదవ షెడ్యూలులోని నాలుగవ పేరా ప్రకారం విలీనానికి అవసరమైన సంఖ్యాబలం తమకున్నదని తెలిపారు. కొద్దిసేపటికే మండలిలో సిఎల్‌పి నేత మహ్మద్ అలీ షబ్బీర్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన మండలి చైర్మన్‌ను కలిసి ఆ నలుగురు ఎంఎల్‌సిలు ఇచ్చిన లేఖను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20న ఎలాం టి సిఎల్‌పి సమావేశం జరగలేదని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున వారి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ లేఖను అందజేశారు.