మరోసారి చర్చలు విఫలం : కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన
జనవరి 4న మరో విడత చర్చలు
కనీస మద్దతు ధరపై కమిటీ
కేంద్రం ప్రతిపాదన
డిమాండ్లపై వెనక్కి తగ్గని రైతు సంఘాలు
న్యూఢిల్లీ : విద్యుత్ బిల్లు పెంపు, పంటల వ్యర్థాల దహనం కేసుల పరిష్కారం విషయంలో బుధవారం నాడు ప్రభుత్వం రైతు సంఘాల నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ప్రధాన అంశాలైన చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ విషయంలో మాత్రం రెండు పక్షాలూ తమ వాదనలకే కట్టుబడి ఉన్నాయి. 41 రైతు సంఘాల ప్రతినిధులతో ఆరో విడత చర్చలు ఐదు గంటలపాటు జరిగాయి. నాలుగు డిమాండ్లలో రెండింటి విషయంలో పరస్పర అంగీకారం కుదిరింది కనుక 50% పరిష్కారం దొరికినట్లే అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. మిగిలిన రెండు అంశాలైన మూడు సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత మీద జనవరి 4 నాడు చర్చలు ఉంటాయని ఆయన తెలిపారు. చర్చలు సుహృద్భావ పూర్వక వాతావరణంలో జరిగాయన్నారు తోమర్. శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నందుకు రైతు సంఘాలను ప్రశంసించారు. అయితే చలి ఎక్కువగా ఉన్నందువల్ల పెద్దలు, మహిళలు, పిల్లలను ఇళ్లకు పంపమని తోమర్ రైతు సంఘాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. చర్చల్లో రైతు సంఘాలు చట్టాల రద్దుకు పట్టుపట్టాయని, కానీ ప్రభుత్వం వాటి ప్రయోజనాలను, రైతులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను వివరించేందుకు ప్రయత్నించిందని తోమర్ అన్నారు. ఇక కనీస మద్దతు ధరకు చట్టబద్ధత గురించి మాట్లాడుతూ దానికి రాతపూర్వకంగా హామీ ఇస్తామని ఇప్పటికే చెప్పామన్నారు తోమర్.
రైతు ప్రతినిధులతో మంత్రుల భోజనం
ఆరో విడత చర్చల్లో కనీస
మద్దతు ధర మరింత మెరుగ్గా అమలయ్యేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం రైతు సంఘాలతో ప్రతిపాదించింది. ఇంకా విద్యుత్ సవరణ బిల్లును, పంటల వ్యర్థాల దహనం విషయంలో న్యాయపరమైన అంశాలను పక్కనపెట్టేందుకు అంగీకరించింది. అయితే రైతు సంఘాల ప్రతినిధులు చట్టాలను రద్దు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌కే కట్టుబడి ఉన్నారు. ముగ్గురు మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సాగుతాయని భావించారు. మంత్రులు రైతులతో కలిసి ‘లంగర్’ (భోజనం) పంచుకున్నారు. తర్వాత సాయంత్రం టీ విరామంలో రైతు సంఘాల నాయకులు ప్రభుత్వం ఇచ్చిన పానీయాన్ని స్వీకరించారు.
ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్ణయాత్మకమైందిగా భావించింది. దీంతో రైతులు ఢిల్లీ సరిహద్దుల నుంచి కొత్త ఏడాది వేడుకలకు తమ ఇళ్లకు తిరిగి వెళ్తారనుకుంది. అయితే చట్టాల రద్దుతో సహా తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించే వరకు నిరసన కొనసాగుతూనే ఉంటుందని రైతు సంఘాల నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకుండా, ఒక కమిటీని నియమస్తామని అంటోంది. అయితే అది రైతు సంఘాలకు అంత ఆమోదయోగ్యంగా లేదని పంజాబ్ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రుల్డు సింగ్ మాన్సా అన్నారు. ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును పక్కన పెడతామని, ఇంకా పంటల వ్యర్థాల దహనం కేసుల నుంచి రైతులకు మినహాయింపును ఇచ్చేందుకు ఆర్డినెన్సును సవరిస్తామని చెప్పిందని ఆయన తెలిపారు. ఇక చర్చలు జరుగుతున్నాయని, అదీ ‘ఎజెండా ప్రకారమే’ అని రైతు నాయకులు వెల్లడించారు. గత చర్చల్లో రైతులు ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరించకుండా, తమ సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చర్చల్లో పురోగతి కనిపించడం లేదని సమాచారం.
చట్టాలు వచ్చాక ధరలు పడిపోయాయి
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ధరలు పడిపోవడంతో, రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకునే పరిస్థితి నెలకొందని సమావేశానికి ముందే కొంతమంది రైతు నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. “కొత్త చట్టాల అమలు తర్వాత ఉత్తరప్రదేశ్‌లో పంటల ధరలు 50% పడిపోయాయి. పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు. వరిని క్వింటాలుకు 800కు కొంటున్నారు. మేం ఈ అంశాలను సమావేశంలో లేవనెత్తుతాం” అని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేశ్ తికాయత్ విలేకర్లతో అన్నారు. “మా డిమాండ్లు నెరవేరే వరకు మేం ఢిల్లీని వీడం. కొత్త సంవత్సర వేడుకలు ఢిల్లీ సరిహద్దుల్లోనే జరుపుకొంటాం” అన్నారు తికాయత్.
తప్పుడు కేసులు ఎక్కువయ్యాయి
కొత్త చట్టాల అమలు తర్వాత గుణ, హోషంగాబాద్‌లో తప్పుడు కేసుల మీద మీడియాలో వచ్చిన కథనాల ప్లకార్డులను తీసుకొని సమావేశానికి వచ్చారు పంజాబ్ రైతు బల్‌దేవ్ సింగ్ సిర్సా. “మాకు కొత్త ఎజెండా ఏదీ లేదు. రైతులు చర్చలకు రావడం లేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. అందుకే డిసెంబర్ 29న చర్చలకు సిద్ధం అని చెప్పాం. మా ఎజెండా కూడా స్పష్టం చేశాం. అయినప్పటికీ చట్టాలు రైతులకు ప్రయోజనకరం అని ప్రభుత్వం వాదిస్తోంది” అన్నారు సిర్సా. తన దగ్గరున్న ప్లకార్డులను చూపిస్తూ, చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని చర్చల్లో లేవనెత్తుతానని సిర్సా తెలిపారు.
ముగ్గురు మంత్రులు, 41 రైతు సంఘాల ప్రతినిధులకు మధ్య చర్చలు విజ్ఞాన్ భవన్‌లో 2.30 సమయంలో మొదలయ్యాయి. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆధ్వర్యంలో ఆహార మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ ప్రభుత్వం తరఫున చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదో విడత చర్చలు డిసెంబర్ 5న జరిగిన తర్వాత చాలా రోజులకు ఆరో విడత చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్ 30న రైతు సంఘాలు చర్చలకు రావాలని కేంద్రం సోమవారం ఆహ్వానించింది. అన్ని అవసరమైన అంశాల మీద, “సహేతుకమైన పరిష్కారం” కనుక్కొనేందుకు పెద్ద మనసుతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మూడు చట్టాల రద్దుకు అనుసరించాల్సిన పద్ధతులు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ గురించే చర్చలు జరగాలని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా మంగళవారం ప్రభుత్వానికి లేఖ రాసింది.
వాస్తవానికి ఆరో విడత చర్చలు ఈ నెల 9వ తేదీన జరగాల్సి ఉంది. హోం మంత్రి అమిత్ షా కొంతమంది రైతు నాయకులతో అనధికారికంగా నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో చర్చలు రద్దయ్యాయి. అయితే షా సమావేశం తర్వాత ప్రభుత్వం కొత్త చట్టాలకు 7 8 సవరణలు సూచిస్తూ, కనీస మద్దతు ధరకు రాతపూర్వక హామీ ఇస్తూ రైతులకు ప్రతిపాదనలు పంపించింది. 35 రోజులుగా వేలాది రైతులు ప్రత్యేకించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలను విరమించుకోవాలని నిరసన చేస్తున్నారు. కొత్త చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలని ప్రభుత్వం వాదిస్తోంది. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడతాయన్నది ప్రభుత్వం మాట. అయితే ఇవి కనీస మద్దతు ధర, మండీ విధానాన్ని బలహీనపరిచి, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆ చట్టాలను రద్దు చేయండి : రైతులు రుద్దే తీరుతాం : కేంద్రం
RELATED ARTICLES