భీమదేవరపల్లి ఘటనపై వివరణ
ప్రజాపక్షం/భీమదేవరపల్లి : గత రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన నాటుకోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకలేదని పశువైద్యాధికారులు ధృవీకరించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామంలో సుమారు 120 నాటుకోళ్లు చనిపోయాయి. బర్డ్‌ఫ్లూ సోకినట్లు వస్తున్న పుకార్లను అధికారులు కొట్టిపారేశారు. కోళ్లు చనిపోయిన ప్రాంతానికి వచ్చి జిల్లా పశు వైధ్యాధికారులు జాయింట్ డైరెక్టర్ వెంకట్ నారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. జిల్లా పశు వ్యాధి పరీక్షల కేంద్రంలో కోళ్లకు పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. మృతిచెందిన కోళ్లలో ఎలాంటి జబ్బు లక్షణాలు లేవని, ఎముకలు మాత్రం విరిగి ఉన్నట్లు చెప్తున్నారు. సమీపంలోనే మరిన్ని నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నాయని వాటిలో ఏలాంటి జబ్బు లక్షణాలు కనిపించడం లేదన్నారు. తెలంగాణలో బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ఫ్లూ వ్యాప్తి నివారణకు అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశామని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చే పక్షుల నిఘా పెట్టాలని కోరినట్లు వెల్లడించారు. నాటుకోళ్ల పెంపకం చేస్తున్న గద్ద సారయ్య దంపతులు చెప్పిన వివరాల మేరకు గత కొన్ని నెలలుగా నాటు కోళ్ల ఫారం పెట్టినట్లు చెబుతున్నారు. తమ కోళ్లు అనుమానాస్పదంగా చనిపోవడంపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారులతో పాటు మండల వైద్యాధికారి మాలతీ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.