HomeNewsBreaking Newsఆ ఐదుగురే..

ఆ ఐదుగురే..

బౌలింగే టీమిండియా ప్రధాన అస్త్రం
క్రీడా విభాగం: ప్రస్తుత టీమిండియా బౌలింగ్‌ విభాగం ముందు ఎన్నడులేని విధంగా పటిష్టంగా ఉంది. గత కొద్ది కాలంగా ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో భారత క్రికెట్‌ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజాయలు సాధిస్తోంది. అయితే ఈ విజయాల్లో బౌలర్ల పాత్ర అధికంగా ఉండడం హర్షణీయం. భారత్‌ విజయాల్లో బౌలింగే ప్రధాన అస్త్రంగా మారింది. ఒకప్పుడు బ్యాటింగ్‌ దళం కారణంగానే టీమిండియాకు గెలుపులు సంభవించేవి. బ్యాట్స్‌మెన్స్‌ భారీ స్కోర్లు సాధిస్తేనే విజయాలు మనకు దక్కేవి. ఉప ఖండంలో పర్వాలేదనిపించినా.. విదేశాల్లో మాత్రం మన బౌలర్లు పూర్తిగా తేలిపోయేవారు. అక్కడి ఫాస్ట్‌, బౌన్సీ పిచ్‌లపై మన బౌలర్లు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేక పోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం భారత బౌలింగ్‌ విభాగంలో ప్రపంచ అగ్రస్థాయి ఆటగాళ్లకు కొదువలేకుండా పోయింది. బ్యాట్స్‌మెన్స్‌ తక్కువ స్కోర్లు నమోదు చేసినా మన బౌలర్లు ఆ స్కోర్లను సైతం కాపాడుకొంటూ చారిత్రక విజయాలు టీమిండియాకు అందిస్తున్నారు. బ్యాట్స్‌మెన్స్‌ నుంచి ఎక్కువగా సహకారం అందకపోయినా బౌలర్లు మాత్రం తమ నాన్యతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమవుతున్నారు. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో టీమిండియా బౌలర్లు తమ విధ్వంసకర బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను వారి సొంత మైదానాల్లో మట్టి కరిపించారు. పేస్‌ దళంతో పాటు స్పిన్నర్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ భారత బౌలర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. ఏ పిచ్‌లోనైన సరే తమ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకొంటున్నారు. భారత్‌ విజయాల్లో బ్యాట్స్‌మెన్స్‌ల కంటే బౌలర్లే ఎక్కువ సహకారం అందిస్తున్నారు. కొంత కాలంగా బౌలర్ల వల్లే టీమిండియాకు అధిక విజయాలు అందాయనడంలో సందేహంలేదు. వారిలో ముఖ్యంగా ఐదుగురు బౌలర్లు (బుమ్రా, షమీ, భువనేశ్వర్‌, కుల్దీప్‌, చాహల్‌) తమ అపారమైన ప్రతిభతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నారు. భారత జట్టులో జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఈ ముగ్గిరి త్రయంతో పేస్‌ దళం చాలా పటిష్టంగా మారింది. మరోవైపు స్పిన్నర్లలో మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, యాజువేంద్ర చాహల్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ఓవరాల్‌గా ఈ ఐదుగురు బౌలర్లు ప్రస్తుత టీమిండియాలో ముఖ్య బౌలర్ల పాత్ర పోషిస్తున్నారు. వీరి ధాటికి ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లు విలవిలలాడుతున్నారు. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. దాదాపు ఒక ఏడాది నుంచి బుమ్రా గొప్ప ప్రదర్శనలతో తన టాప్‌ స్థానాన్ని కాపాడుకుంటు వస్తున్నాడు. మరోవైపు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ కూడా టాప్‌ కొనసాగుతున్నారు. ఇక ఈ సంవత్సరం ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారత జట్టు పటిష్టమైన బౌలింగ్‌ దళంతో సిద్ధమయింది. అందుకే ఈసారి భారత జట్టు ప్రపంచకప్‌లో హాట్‌ ఫెవరెట్‌గా బరిలో దిగనుంది. ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు మరో పెద్ద పరీక్షగా ఆస్ట్రేలియా సిరీస్‌ నిలవనుంది. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనలు చేస్తే ప్రపంచకప్‌ గెలవడం మరింత సులువవుతందని విశ్లేషకులు చేబుతున్నారు. ఈ నెల 24 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ జరగనుంది. అనంతరం మార్చి 2 నుంచి ఐదు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.
అగ్రస్థానంలో బుమ్రా..
భారత జట్టులో ప్రధాన బౌలర్‌ పాత్ర పోషిస్తున్న జస్ప్రీత్‌ బుమ్రా ఐసిసి వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న బుమ్రా భారత్‌కు ఒంటి చేత్తో ఎన్నో గొప్ప విజయాలు అందిస్తున్నాడు. టెస్టుల్లో, వన్డేల్లో మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. గత ఏడాది (100.5) ఓవర్లు వేసిన బుమ్రా (3.63) సగటుతో 22 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అదే 2017 సంవత్సరంలో అద్భుతంగా రాణించిన బుమ్రా ఆ ఏడాది (199.2)ఓవర్ల్లలో (5.14) సగటుతో 39 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 2016లో (68.3) ఓవర్లలో 17 వికెట్లు దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా బుమ్రా వన్డే క్రికెట్‌లో (368.3) ఓవర్లలో (4.25) సగటుతో 78 వికెట్లు తీశాడు. క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్‌ చేస్తు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ బుమ్రా విజృంభించి బౌలింగ్‌ చేశాడు. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తు చేసి భారత్‌కు చారిత్రక టెస్టు సిరీస్‌ అందించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. అంతే కాకుండా ఒక ఏడాదిలో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రికార్డుల్లో బుమ్రా తన పేరును లిఖించుకున్నాడు. ఇక ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో భారత్‌ తరఫును బుమ్రా ప్రధాన ఆకర్షనగా నిలవనున్నాడు.
కుల్దీప్‌ యాదవ్‌
భారత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌యాదవ్‌ వరుస మెరుగైన ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్‌లో తనకంటు ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఈ చైనా మన్‌ బౌలర్‌ తన స్పిన్‌ మయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌ను తిప్పేస్తున్నాడు. అలాగే గొప్ప ప్రదర్శనలతో ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. గత కొంత కాలంగా భారత స్పిన్‌ విభాగంలో కుల్దీప్‌ ప్రధాన బౌలర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇతని రాకతో భారత సీనియర్‌ బౌలర్‌ రవీచంద్ర అశ్విన్‌ దారులు మూసుకుపోయాయి. కుల్దీప్‌ తనకు లభించి అన్ని అవకాశాలను పూర్తిగా సద్వినియోగించుకున్నాడు. స్పిన్‌కు అనుకూలంచని ఫాస్ట్‌ పిచ్‌లపై సైతం తన స్పిన్‌ మ్యాజిక్‌ను ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ఈ యువ క్రికెటర్‌. ప్రస్తుతం టీమిండియాలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ఇంగ్లాండ్‌ వరల్డ్‌కప్‌లో టీమిండియా తరఫున కుల్దీప్‌ యాదవ్‌ ముఖ్య భుమిక వహించనున్నాడు.
టాప్‌ ఫైప్‌లో చాహల్‌..
మరో మణీకట్టు స్పిన్నర్‌ యాజువేంద్ర చాహల్‌ భారత బౌలింగ్‌ దళంలో నిలకడమైన ఆటతో తన ప్రత్యేకతను చాటుకొంటున్నాడు. వన్డేల్లో తనకు తిరిగులేదని నిరూపిస్తూ గొప్పగా రాణిస్తున్నాడు. ఏ పిచ్‌లోనైనా మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం తన మెరుగైన ప్రదర్శనలతో ఐసిసి వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌తో టాప్‌ చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌ కప్‌ టీమిండియా జట్టులోనూ దాదాపు తన చోటును భర్తీ చేసుకున్నాడు. లభించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఇతనికి కలిసొచ్చింది. ఇప్పటి వరకు 40 వన్డేలు ఆడిన యాజువేంద్ర చాహల్‌ 39 ఇన్నింగ్స్‌లలో 71 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఇతని అత్యుత్తమ ప్రదర్శన (6/42). ఇక ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే ఆసీస్‌ సిరీస్‌లోనూ చాహల్‌ మెరుగైన ప్రదర్శనలు చేయడం ఖాయమని తెలుస్తోంది.
జోరుమీదున్న భువనేశ్వర్‌..
ఇక మరో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా లభించిన ప్రతి అవకాశాన్ని సొమ్ము చేసుకొంటున్నాడు. యార్కర్‌ స్పేషలిస్ట్‌గా పేరొందిన భూవీ ఆరంభపు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేయడంలో మంచి మహార్థ్యం సాధించాడు. చివరి ఓవర్లలోనూ మ్యాచ్‌ ఫలితాలు తారుమారు చేయగల సత్తా ఇతనికి ఉంది. ప్రస్తుతం టీమిండియాలో గల పేస్‌ త్రయంలో భూవీ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు. బుమ్రా తర్వాత రెండో బౌలర్‌గా రాణిస్తున్నాడు. భారత జట్టు విజయాల్లో ఇతని పాత్ర కూడా కీలకం. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున మెరుగైన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించిన భువనేశ్వర్‌ ఆతర్వాత జాతీయ జట్టులో సైతం అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రపంచకప్‌ జట్టులో ఇతని స్థానం దాదాపు ఖయమని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం భూవీ ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంతో టాప్‌ చోటు దక్కించుకున్నాడు.
ఫామ్‌లో ఉన్న షమీ..
ఇక భారత సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల, గాయాలతో సతమతమవుతూ క్రికెట్‌లో సత్తా చాటలేక పోయాడు. కానీ ఇటీవలే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీసుల్లో తన సత్తా చాటుకొని తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తున్న షమీ మరో కీలక పేసర్‌గా భారత జట్టుతో తన చోటును పదిలం చేసుకున్నాడు. కొంత కాలంగా టెస్టుకే పరిమితమైన షమీ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తనకంటు ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతి నివ్వడంతో అతని స్థానంలో భారత జట్టులో చోటు దక్చింకున్న షమీ ఆ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనలతో అందరిని సంతోషపర్చాడు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మంచి పెర్ఫామన్స్‌లతో వరుసగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు అందుకున్నాడు. భారత్‌ వన్డే సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కివీస్‌ సిరీస్‌లోనూ తన సత్తా చాటుకొని ప్రపంచకప్‌ జట్టులో తన స్థానాన్ని మరింతగా పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం షమీ వన్డే ర్యాంకింగ్స్‌లో 30వ ర్యాంక్‌లో ఉన్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments