ప్రజాపక్షం/హైదరాబాద్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన, అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలపై దూకుడుగా చర్యలు తీసుకున్న టిఆర్‌ఎస్.. ఇద్దరు నేతల విషయం లో మాత్రం వెనుకడుగు వేస్తోంది. నిజామాబాద్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు విషయంలో టిఆర్‌ఎస్ ఇరకాటంలో పడినట్టు సొంత పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుండి పోటీ చేసిన జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ నుండి పోటీ చేసిన హర్షవర్దన్‌రెడ్డి ఓడించారు. అనంతరం ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీలోని వార్డు టిక్కెట్ల విషయ మై స్థానిక ఎంఎల్‌ఎ హర్షవర్దన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మధ్య వివాదం నెలకొన్నది. రాష్ట్ర పార్టీ నేతలు జోక్యం చేసుకున్నప్పటికీ ఆ వివాదం సద్దుమణగలేదు. తన వర్గీలయులకు టిక్కెట్ దక్కకపోవడంతో జూపల్లి వర్గీయులు టిఆర్‌ఎస్ రెబెల్స్‌గా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే పోటీ నుంచి తప్పించాలని కెటిఆర్ సూచించనప్పటికీ జూపల్లి వినలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులను జూపల్లి వర్గీయులు గెలుపొందగా, మిగిలిన 9 వార్డులలో టిఆర్‌ఎస్ గెలుపొందింది. కాగా గెలుపొందిన వారిని తిరిగి పార్టీలో తీసుకునేలా జూపల్లి కృష్ణారావు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జూపల్లి కృష్ణారావు స్వయంగా తెలంగాణ భవన్‌కు వెళ్లి కెటిఆర్‌ను కలిసినా పెద్దగా స్పందన రాలేదు. కొల్లాపూర్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను జూపల్లి వర్గీయుల మద్దతు లేకుండానే టిఆర్‌ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో గెలుచుకుంది. జూపల్లి వర్గీయుల మద్దతు తమకు అవసరం లేదని, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన జూపల్లిపై వేటు తప్పదని ముందు నుంచి టిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఆయనపై వేటు వేసేందుకు టిఆర్‌ఎస్ వెనుకగుడువేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ కంటే ఆయనకే పట్టు ఉండడం, అది స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో నిరూపితమవడమే కారణమని భావిస్తున్నారు. మరోవైపు ఐజ మున్సిపాలిటీ పరిధిలో టిఆర్‌ఎస్ రెబెల్‌గా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన తిరమల్ రెడ్డి వర్గీయుల మద్దతును మాత్రం తీసుకున్నది. ఇక్కడ టిఆర్‌ఎస్‌కు సరైన మద్దతు లేకపోవడంతోనే రెబెల్స్ మద్దతు తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ ఇద్దరితో ఇరకాటం
RELATED ARTICLES