ప్రజాపక్షం/హైదరాబాద్ : ఆస్తులు, భూముల అమ్మకాలపై ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఆస్తుల అమ్మకాలతో నిధులను సమకూర్చుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారం ఆస్తులతో పాటు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థకు చెందిన అన్ని ఆస్తులను ‘బహిరంగ వేలం’ వేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.అ కమిటీ ఆస్తులు, ప్లాట్ల అమ్మకాలపై విధివిధానాలను ఖరారు చేయనుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రరామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకంపై ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజీవ్ స్వగృహలను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో ఇక బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయంచింది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అనుభవం ఉన్న ప్రముఖ సంస్థ సిఫారసుల అనుగుణంగా బహిరంగ వేలం వేయాలని నిర్ణయించింది.
పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా గృహాలు అందించేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ రూ. 8504 కోట్లతో 32 ప్రాజెక్టుల ద్వారా 46,565 ఇండ్లను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగానే 2008- సంవత్సరాల మధ్య వివిధ బ్యాంకుల నుండి రుణాలను సేకరించి రూ. 6301.11 కోట్లతో 20 హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టింది. అయితే 2011లో రాజీవ్ స్వగృహ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో అన్ని కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో నాడు మంత్రుల బృందం, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రాజీవ్ స్వగృహలను ఆదుకునేందుకు చర్యలను చేపట్టింది. అలాగే అప్పటి వరకు చేపట్టిన పనులను యాధావిధిగా నిలిపివేస్తూ కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా నాటి ప్రభుత్వం రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే అప్పటికే రాజీవ్ స్వగృహ నిలిపివేసిన వివిధ ప్రాజెక్టులపై 1621.26 కోట్లు వెచ్చించింది. దీంతో అన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఆస్తులకు ఆక్యూపెన్సీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాగా బండ్లగూడ ప్రాజెక్ట్‌లో 2746 ఫ్లాట్స్ నిర్మించగా 2017 జూన్ వరకు 506 మాత్రమే ఫ్లాట్లను విక్రయించారు. పోచారం ప్రాజెక్ట్‌లో 2604 ఫ్లాట్లను నిర్మించగా కేవలం 180 మాత్రమే విక్రయించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభు త్వ సహకారంతో కార్పొరేషన్‌కు ఉన్న రుణాలతో పాటు వడ్డీతో సహా రూ.1071.39 కోట్లను చెల్లించి అన్ని ప్రాజెక్టులను బ్యాంకు తనఖా నుండి ఆస్తులను విడిపించింది. ఆ తర్వాత బండ్లగూడ, పోచారం ప్రాజెక్ట్‌లలో పూర్తయిన, కొంత మేరకు పనులను పూర్తి చేసిన ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2016లో పలు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. అయినప్పటికీ బండ్లగూడ, పోచారం ప్రాజెక్ట్‌లోని ఫ్లాట్లు మాత్రం అమ్ముడుపోలేదు. తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ఆస్తులతో పాటు రాజీవ్ స్వగృహసంస్థ ఆస్తులను కూడా బహిరంగ వేలం ద్వారా పారదర్శకంగా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆస్తుల విక్రయాలకు శరవేగంగా అడుగులు
RELATED ARTICLES