కొత్తగూడెం ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సాంబశివరావు
మెరుగైన సేవలందించి ప్రభుత్వ వైద్యంపై అమ్మకాన్ని కలిగించాలని సూచన
ప్రజాపక్షం/లక్ష్మీదేవిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని వార్డులు, డయాలసిస్ సెంటర్‌ను సందర్శించి రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కూనంనేని సాంబశివరావు ఆసుపత్రి వైద్య సిబ్బందితో పలు సమస్యలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డుల్లో, ఆసుపత్రి ఆవరణలో విద్యుత్ దీపాలు, ఫ్యాన్‌లు, రోగుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేయపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 900 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్నారని, వీరికి సరైన సౌకర్యాలు అందించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలే ప్రభుత్వ వైద్యశాలలను సందర్శిస్తారని, ఇలాంటి వారికి మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత వైద్యశాఖ అధికారులు, వైద్యులు సిబ్బందిపై ఉందన్నారు. ఆంబులెన్స్ సౌకర్యంతో పాటు మరో ఐదు డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై వైద్యశాఖ మంత్రిని, రాష్ట్రస్థాయి అధికారులను సంప్రదించి వాటి ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు. కొద్దిరోజుల్లో మరోసారి ఆసుపత్రిని సందర్శిస్తానని, అప్పటిలోగా లోటుపాట్లు సరిచేయాలని, లేనిపక్షంలో తగు చర్యకు సిఫార్సు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ షాబీర్‌పాషా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రసూతి సూపరిండెంట్ లక్ష్మణ్‌రావు, డిసిఎంఎస్ రవిబాబు, డిఎం అండ్ హెచ్‌వో శిరీష, ఆర్‌ఎంవో పుష్పలత, స్థానికులు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, షేక్ ఫహీమ్, గడ్డం ప్రభాకర్, యు.హరీష్, సత్యనారాయణ, ఖయూమ్ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో కూనంనేని తనిఖీ
RELATED ARTICLES