నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు, ఉదయం 5:30 నుంచి సోనీ నెట్ వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఆడిలైడ్: ఆసీస్‌తో పోరుకు కోహ్లీ సేన రెడీ అయింది. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కి ఈ రోజు తెరలేవనుంది. ఒకవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ భారత్.. మరోవైపు ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆస్ట్రేలియా.. ఈ రెండు జట్ల మధ్య సమరానికి ఆడిలైడ్ వేదికయింది. అయితే భారత జట్టుకు స్వదేశంలో, ఉపఖండంలో మంచి రికార్డు ఉంది. ఇక్కడ వరుస విజయాలు సాధించి నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. కానీ, విదేశాల్లో, యూరప్ కంట్రీస్‌లో భారత్ రికార్డులు పేవలంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలో పర్యటించిన టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మన్లు విఫలమయ్యారు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-2తో ఓటమిపాలైంది. తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-4తో కోల్పోయింది. అనంతరం ఉపఖండం, స్వదేశంలో జరిగిన టెస్టుల్లో భారత జట్టు తిరిగి పుంజుకుంది. వరుసగా విజయాలు సాధించి ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా అవతరించింది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటుకుంది.
ఆత్మ విశ్వాసంతో టీమిండియా…
ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఈ బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మంచి ఫలితాలు సాధించిన భారత జట్టు ఇప్పుడు ఆసీస్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో గురువారం మైదానంలో అడుగుపెట్టనుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీసే భారత్‌కు కఠిన పరీక్షగా చెప్పొచ్చు. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయం ఈ సారి కోహ్లీ అందిస్తాడా అన్నదే అందరి మదిలో ఉన్న ప్రశ్న.. కొద్ది రోజుల క్రితం సిడ్నీ వేదికగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మన్లు అర్ధ శతకాలతో చెలరేగారు. రెండో ఇన్నింగ్స్‌లో మురళి విజయ్ సెంచరీతో రాణించాడు. మరోవైపు గత కొంతకాలంగా విఫలమవుతున్న కెల్ రాహుల్ అర్ధ శతకం సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో చెలరేగిన యువ ఓపెనర్ పృథ్వీ షా తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడి తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో చోటు దక్కించుకున్న మురళి విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా శతకం బాది ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పుజారా, రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హనుమా విహారీలు కూడా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో సత్తా చాటారు. ఇక, బౌలింగ్ విషయానికోస్తే భారత బౌలర్లు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తేలిపోయారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆసీస్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేసింది. మహ్మద్ షమీ ఒక్కడే 3 వికెట్లతో కొద్దిగా పర్వలేదనిపించినా.. మిగతా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బ్యాట్స్‌మన్ల హవా కొనసాగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం జరిగే తొలి టెస్టుకు మరింత సమయం ఉండడంతో భారత బౌలర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఎక్కువసేపు మైదానంలోనే ఉండి పిచ్‌పై అవగహన కలిగేందుకు కఠోర సాధన చేశారు. ప్రస్తుతం కోహ్లీ సేన మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకప్పుడు బౌలింగ్ సమస్యగా ఉండే టీమిండియాలో ఇప్పుడు ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లకు కొదువలేదు. బౌన్సీ పిచ్‌లపై విజృంభించే ఫాస్ట్ బౌలర్ల దళం అందుబాటులో ఉంది. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ బౌలర్లు భారత జట్టులో ఉన్నారు. ఇక, స్పిన్నర్లలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, చాహల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా భారత జట్టులో దాదాపు అందరిలో ఉంది. వీరు ఒకసారి చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు పరాభవం ఖాయమనే చెప్పాలి.
ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం…
ఇక ఆస్ట్రేలియా విషయానికోస్తే సొంత గడ్డపై వారిని ఓడించడం ఏ జట్టుకైన పెద్ద సవాలే. ప్రస్తుత జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకున్నా ఆ జట్టును తేలికగా తీసుకోలేమని విశ్లేషకుల అంచనా. వీరిద్దరూ లేనప్పటి నుంచి ఆసీస్ జట్టు ఘోర పరాజయాలను చవిచూస్తుందనడంలో సందేహం లేదు. కానీ, ఈ ఏడాది ఆసీస్ జట్టు తమ సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడలేదు. భారత్‌తో మొదలయ్యే ఈ సిరీసే వారికి స్వదేశంలో మొదటిది. ఈ ఏడాది విదేశాల్లో టెస్టు సిరీస్‌లు ఆడిన ఆస్ట్రేలియా వరుస ఓటములను మూటగట్టుకుంది. కానీ, సొంతగడ్డపై ఆసీస్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఈ జట్టును వారి హోంగ్రౌండ్స్‌లో ఓడించడం ఏ జట్టుకైనా అంత ఈజీ కాదు. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా ఈ జట్టును తక్కువగా తీసిపారేయలేము. ఆసీస్ జట్టు చివరి కంఠం వరకు పోరాడుతూనే ఉంటుంది. సులువుగా ఓటమిని అంగీకరించదు. బ్యాటింగ్‌లో మాజీ కెప్టెన్ స్మిత్, వార్నర్ లేని లోటు కొద్దిగా కనిపిస్తోంది. కానీ, మిగతా ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శనలతో వారి లోటును తూడిచిపెడుతున్నారు. ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ సంచలనాలకు మరోపేరు. ఇతను ధాటిగా ఆడుతూ జట్టుకు బలమైన పునాది వేయగలడు. ఈసారి ఇతనికి తోడుగా మార్కస్ హరీస్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. హరీస్‌కు ఇది తొలి టెస్టు. గత కొంతకాలంగా అద్భుత ప్రతిభ కనబర్చుతూ జట్టులో చోటు సంపాదించాడు. మరోవైపు ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా చెలరేగుతున్న ఉస్మాన్ ఖవాజ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ఆసీస్ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి ఖవాజపై ఆసీస్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ఇక ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్‌ను తప్పించి అతని స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న హాండ్స్‌కోంబ్‌కు అవకాశం కల్పించారు. ఆసీస్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ జట్టుకు అండగా నిలుస్తూ పరుగులు రాబడుతున్నాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. వీరందరితో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, షాన్ మార్ష్, జాస్ హేజిల్‌వుడ్‌తో పేస్ దళం చాలా ప్రమాదకరంగా ఉంది. స్పిన్నర్ నాథన్ లియాన్ ఆసీస్ జట్టులో కీలక స్పిన్నర్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు జట్లలో ఏ జట్టు గెలిస్తుందో అంచనా వేయడం తేలికకాదు. భారత స్టార్, పరుగుల యంత్రం కోహ్లీని కట్టడి చేసేందుకు ఆసీస్ ప్రత్యేక ప్రణాళికలను అల్లుకుంది. మరోవైపు వాటిని తిప్పి కొట్టేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ టెస్టు సిరీస్ రసవత్తంగా సాగుతుందనే చెప్పాలి. ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయం. తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా 11మందితో కూడిన తుది జట్టును ప్రకటిస్తే.. భారత్ మాత్రం 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆరో స్థానం కోసం రోహిత్ శర్మ, హనుమా విహారి మధ్య పోటీ ఉందని కోహ్లీ అన్నాడు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళి విజయ్, కెఎల్. రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: టిప్ పైన్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ హారిస్, అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్స్‌కొంబ్, హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్.
ఆసీస్‌తో పోరుకు కోహ్లీసేన రెడీ…
RELATED ARTICLES