హైదరాబాద్ : పంచాయతీ, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరా రు జాబితా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అవి పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు చేరుకోవడానికి శనివారమే తుదిగడువు. అయినప్పటికీ ఒక్క జిల్లా నుంచి కూడా జాబితాలు రాలేదు. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, వార్డుల్లో వార్డు సభ్యుల పదవులకోసం పోటీ పడే ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ సారి గతంలో ఉన్న రిజర్వేషన్ మారుతుందని భావిస్తున్న చోట్ల ఈ ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు, అనంతరం డిసెంబర్ 31 వర్కింగ్ డే. ఆరోజు కమిషనరేట్‌కు రిజర్వేషన్ల జాబితా వచ్చినప్పటికీ వాటిని పరిశీలించి ఫైనల్ చేయడానికి రాష్ట్ర స్థాయి అధికారులకు కనీసం ఒక రోజు పడుతుంది. మరుసటి రోజు నూతన సంవత్సరం తొలిరోజు సెల వు దినం. అంటే ప్రభుత్వానికి చేరి అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తుదిజాబితా చేరుకోవడానికి మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.