మండలి స్థానం కోసం టిఆర్‌ఎస్ నేతల ఎదురు చూపు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ఏడు శాసన మండలి స్థానాలను త్వరలో భర్తీ చేయనున్నారు. శాసన మండలిలో ఆరు స్థానాలు ఖాళీ కాగా గవర్నర్ కోటాలో మరో స్థానం ఖాళీ అయింది. మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్ తో పాటు కడియం శ్రీహరి, ఆకుల లలిత, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఫరీరుద్దీన్ పదవీ కాలం జూన్ మూడుతో ముగిసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఎన్నికల సంఘం ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కరోనా పరిస్థితి గురించి అడిగినట్లు సమాచారం. అయితే ఈ ఆరు స్థానాల్లో ఖమ్మంకు చెందిన టిఆర్‌ఎస్ నేతలు కూడా తమకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. వివిధ సందర్భాలలో శాసన మండలికి ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఖమ్మంజిల్లాకు చెందిన కొందరి పేర్లు తెరపైకి రావడం వారికి అవకాశం దక్కకపోవడం షరామామూలే అవుతుంది. ఈసారైనా ఖమ్మంజిల్లా నాయకులకు అవకాశం దక్కుతుందేమో చూడాలి. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒకరిద్దరికి టిఆర్‌ఎస్ అధినేత శాసన మండలిలో స్థానం కల్పించేందుకు హామీ ఇచ్చినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. మరో రెండున్నర ఏళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు శాసన మండలి స్థానం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆరు స్థానాలు టిఆర్‌ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరేళ్ల పాటు శాసన మండలిలో కొనసాగవచ్చునన్న ఆలోచన నేతల మదిలో మెదులుతుంది. ఎన్నికల క్షేత్రంలోకి దిగితే కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి రావడమే కాకుండా గెలుపుపై కూడా నమ్మకం లేని పరిస్థితి. అదే శాసన మండలి అభ్యర్థి అయితే ఎటువంటి ఖర్చు లేకుండానే ఆరేళ్ల పాటు పదవీలో కొనసాగవచ్చు. ఛాన్స్ దొరికితే మంత్రి పదవి కొట్టేయ్యవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ నాయకులు కొందరు ఏ పదవి లేక సీనియర్ నాయకులు గానో మాజీలు గానో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నారు. వారి అభిమానులు ఈసారి మాకే తప్పదు చూడండి అంటూ ప్రతిసారి సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టింగులు పెట్టేవారు. అలా ప్రచారం చేయడం చివరకు నిరాశ పడడం వారి అభిమానులకు కూడా అలవాటైపోయింది. ఈ దఫా ఆరింటిలో ఒక్కరికైనా ఖమ్మంజిల్లాకు చెందిన నేతలకు అవకాశం దక్కుతుందని టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించి అవకాశం దక్కుతుందా అన్నది వేచి చూడాలి. దీనితో పాటు డిసెంబరు మాసంలో స్థానిక సంస్థల నుంచి ఎంఎల్‌సిగా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణ పదవి కాలం కూడా ముగియనుంది. బలబలాల రీత్యా మరోసారి కూడా ఇక్కడి టిఆర్‌ఎస్ అభ్యర్దే స్థానిక సంస్థల నుండి శాసన మండలికి ఎన్నికయ్యే అవకాశం ఉంది. బాలసాని లక్ష్మీనారాయణ టిడిపి పక్షాన ఒకసారి, టిఆర్‌ఎస్ పక్షాన మరోసారి శాసన మండలి సభ్యులుగా పని చేశారు. మరోసారి అవకాశం కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో అవకాశం దక్కని వారు స్థానిక సంస్థల నుంచైనా అవకాశం కల్పించేందుకు, హామీ పొందెందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో ఏ ముందో, ఎవరికి అవకాశం దక్కనుందో వేచి చూడాల్సిందే.