ముంబయి: ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను మార్చకుండా అలాగే ఉంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం కుంచించుకు పోనుందన్న అంచనాతో, అండగా నిలిచేందుకు మరింత ఉపశమనం కలిగించాలని సూచించింది. తన ‘అకామొడేటివ్’ విధానాన్ని అలాగే కొనసాగిస్తూ ఆరుగురు సభ్యుల విధాన కమిటీ రెపో రేటును 4శాతం దగ్గరే ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. రుణవ్యయాన్ని తగ్గించేందుకు బహిరంగ మార్కెట్‌లో బాండ్ల కొనుగోళ్లను రెట్టింపు చేస్తూ, దానిని 20,000 కోట్ల రూపాయలకు పెంచడం, ప్రభుత్వ రుణాలను కొనేందుకు అనుమతించడం, లక్ష కోట్ల రూపాయలను అందుబాటులో ఉంచడం ద్వారా కార్పొరేట్లకు ద్రవ్య లభ్యత కల్పించింది. ఆర్థిక కార్యకలాపాలకు అండగా నిలబడటంతో పాటు, ప్రభుత్వం చేపట్టిన రుణ కార్యక్రమం సాఫీగా సాగేందుకు హామీ ఇచ్చేలా ఈ చర్యలు ఉన్నాయి. ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి సంబంధించి ఆర్థికవృద్ధి 23.9 కిందికి పడిపోయినట్లు, అది చివరిదైన జనవరి మార్చి త్రైమాసికంలోనే పైకి రావచ్చని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కరోనా రెండో దశ వ్యాప్తి భయాన్ని పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మొదలైనట్లు కనిపిస్తోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఫ్యాక్టరీలు, నగరాలు సాధారణ స్థితికి వస్తున్నాయని ఆయన అన్నారు. మొత్తానికి -2020- 21వాస్తవ జిడిపి 9.5 శాతం తగ్గనుందని, ఒకవేళ ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా, బలంగా దెబ్బతినొచ్చని, అయినప్పటికీ, ఇన్ని ప్రతికూలతల మధ్య మనం పోరాడి, బతకగలమని ఆయన పేర్కొన్నారు. వృద్ధిని సాధ్యమైనంత నిలబెట్టుకునేందుకు, కొవిడ్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అకామొడేటివ్ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తామని, అదే సమయంలో ద్రవ్యోల్బణం అలాగే ఉండనుందని దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణానికి లాక్‌డౌన్ సమయంలో పంపిణీలో ఏర్పడిన అంతరాయం, ఇతర అంశాలు కారణాలని ఆయన గుర్తుచేశారు. అయితే, పంపిణీ వ్యవస్థ గాడిన పడుతుండటంతో 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ద్రవ్యోల్బణం 4.5— 5.4 శాతానికి పరిమితం కావొచ్చని ఆయన అన్నారు. పంపిణీ మెరుగు కావడం, డిమాండ్ తగ్గడం, ఖరీఫ్‌లో అధిక దిగుబడుల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.3 శాతానికి తగ్గనుందని ఆర్‌బిఐ ఆశావహంగా ఉంది. ద్రవ్య లభ్యత పెంచేందుకు భారత ప్రభుత్వ సెక్యూరిటీలను కొనేందుకు 20,000 కోట్ల రూపాయల విలువగల బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను ప్రకటించింది. జిఎస్‌టి వసూళ్లు తక్కువగా ఉండటంతో వీటిని రాష్ట్రాల రుణ కార్యక్రమాల కోసం కూడా విస్తరించింది. రిటైల్ రంగం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే గరిష్ఠ రుణ పరిమితిని 5 కోట్ల నుంచి 7.5 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. ఇది ఆయా రంగాల వారికి బ్యాంకుల నుంచి అందే రుణ లభ్యతను పెంచుతుంది. ఇంకా ఇళ్ల రుణాల మీద రిస్కు వెయిటేజీని కూడా ఆర్‌బిఐ క్రమబద్ధం చేసింది. ఇక దేశీయ వ్యాపారాలు, సంస్థల్లో రియల్ టైం చెల్లింపులు వేగంగా, నిరంతరాయంగా జరుపుకొనేందుకు డిసెంబర్ నుంచి రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్‌బిఐ నిర్ణయించింది. గత డిసెంబర్‌లో ఆర్‌బిఐ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
ఆర్‌బిఐ వడ్డీరేట్లు యథాతథం
RELATED ARTICLES