అనుమతి లేకుండానే లోన్ యాప్‌లు
కంటికి కనిపించని దోపిడీ
ఖజానాకు గండికొడుతున్న విదేశీ సంస్థలు
ఏ మాత్రం నిఘా పెట్టని కేంద్రం
ఇష్టారీతిన గూగుల్‌లో ‘లోన్‌యాప్’లు
ప్రజాపక్షం/హైదరాబాద్ “కంటికి కనిపించని ఆర్థిక నేరగాళ్లు”యథేచ్ఛగా కంటి ముందే దోపిడీకి పాల్పడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ ఆర్థిక నేరాలకు అడ్డాగా ఉపయోగించుకుంటున్నారు. విదేశాలకు చెందిన లోన్‌యాప్‌లు భారత ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఇక్కడి వారిని వేధింపులకు గురిచేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇన్‌స్టెంట్ లోన్స్ పేరిట గూగుల్‌లో ‘లోన్‌యాప్స్’ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. క్షణాల్లో రుణాలంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారిని ఆకర్షించ డం, ఆ తర్వాత వారిపై వడ్డీ భారం మోపి వేధింపులకు పాల్పడడం, అప్పటికీ స్పందిచకపోతే వారి పరువు తీయడం ఇది ‘లోన్‌యాప్’నిర్వాకం. గంటల్లో రుణాల పేరుతో ‘లోన్‌యాప్’కు చెందిన పలు సంస్థలు సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నా యి. దీనికి సంబంధించిన పలు పోస్టులు చక్క ర్లు కొడుతున్నప్పటికీ అసలు ఈ సంస్థలకు ఎంత వరకు న్యాయబద్ధత ఉన్నదనే అనుమానం అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాకపోవడం గమనార్హం. ‘లోన్‌యాప్’ వేధింపులతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఈ అంశం తెరమీదకు వచ్చింది. తీరా ఈ యాప్‌లు ఎవరు నిర్వహిస్తున్నారు. దీని వెనకాల ఎవరు అనే అంశంపై పోలీసులు కూపీ లాగడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన పలు కేసుల్లో ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్ నగరాలకు చెందిన పలువురిని అరెస్ట్ చేసి కేసును విచారిస్తున్నారు. అయితే ఈ సంస్థలకు అసలు సూత్రధారులు, ఇందులో పాత్రధారులు ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తీగ లాగితే డొంగ కదిలినట్టుగా ఇంతకు ఈ యాప్‌లు ఎవరు నిర్వహిస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీయగా అసలు సూత్రధారులు, పాత్రధారులు భారతీయులే కాదని తేలింది. ఆయాప్‌లు ఇచ్చే రుణాలను వసూలు చేసేందుకు కాల్‌సెంటర్ పేరుతో కొన్ని సంస్థలు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. రుణాలు పొందిన వారిని వేధింపులకు గురి చేసేందుకు లోన్ యాప్ నిర్వాహకులు మూడు పద్ధతులను ఎంచుకుంటున్నారు. రుణాలు తిరిగి చెల్లించే గడువు తేదీని బాధితులకు గుర్తు చేయడం , ఆ తర్వాత వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం, అప్పటికీ డబ్బులు రాకపోతే ఇక ఆ బాధితునికి సంబంధించిన బంధువులు, మిత్రుల వద్ద అతని పరువు తీయడం, ఇలా మూడు పద్ధతుల్లో బాధితున్ని రాసి రంపాన పెడుతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివిధ రాష్ట్రాల్లో లోన్‌యాప్ ముఖ్యులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ యాప్‌లోన్‌లో వారి పాత్ర కేవలం ‘కోరియర్ సర్వీస్’గానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొరవడిన నిఘా..నిర్లక్ష్యం
ఏ చిన్న పాటి ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించాలన్నా అందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) అనుమతి అవసరం. అందుకు లైసెన్స్ పొందడం, ఆర్‌బిఐ నిబంధలను పాటించడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం గూగుల్‌లో ఉన్న ‘యాప్‌లోన్’లకు దాదాపు లైసెన్సులు లేకుండానే తమ వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగిస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. సోషల్‌మీడియా వేదిక ద్వారా దోపిడీ, లోన్‌యాప్‌ల ద్వారా మోసపోతున్నారనే ఫిర్యాదులు అనేకం వస్తున్నప్పటికీ దీనిపై కేంద్ర ఆర్థిక, నిఘా సంస్థలు కూడా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం కనీసంగా 60 రోజుల తర్వాత రుణాలు చెల్లించే గడువు కల్పించాలి. పైగా వడ్డీ విషయంలోను అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ ‘లోన్‌యాప్’ సంస్థలు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా రుణాలు తీసుకున్న ఏడు రోజుల నుంచి 20 రోజులు, లేదా నెల రోజుల గడువుతో బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. దీనిని తట్టుకోలేని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొందరు వారి అప్పును తీర్చేందుకు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆర్‌బిఐ అనుమతులు పొందకుండానే యద్ధేచ్చగా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని గుర్తించిన పోలీసులు గూగుల్ సంస్థకు లేఖ రాశారు. ఆర్‌బిఐ అనుమతులు లేని, నిబంధనలు పాటించని యాప్‌లను గూగుల్ నుంచి తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
ఖజానాకు భారీ దెబ్బ
విదేశీ సంస్థలకు చెందిన ‘యాప్‌లోన్’భారత ప్రభుత్వ నిబంధనలు, ఆర్‌బిఐ లైసెన్స్ పొందకుండా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగి స్తున్నాయి. ఈ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలపై పన్ను(జిఎస్‌టి) చెల్లించాల్సి ఉంటుంది. కానీ లోన్‌యాప్ నిర్వాహకులు జిఎస్‌టిని చెల్లించకుండానే నేరుగా వారు తమ దేశం నుంచి భారతదేశంలోని పలు నగరాల్లో రుణ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నాయి. ఇలా కొన్ని కోట్లరూపాయల్లో లోన్‌యాప్ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాపారంపై కేంద్రం ప్రభుత్వం నిఘా పెట్టి ఉంటే ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో పన్ను వసూలయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఆన్‌లైన్‌లో తమ వ్యాపారాన్ని నిర్వహించుకోవాలంటే కొన్నినిబంధనలు, ఆయా దేశ, లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులను అడుగుతారు. కానీ లోన్‌యాప్ విషయంలో అటు గూగుల్ సంస్థ, ఇటు ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోట్ల రూపాయాల్లో వ్యాపారం సాగుతున్నప్పటికీ యాప్‌లోన్‌పై కట్టడి చేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం.
ఆర్‌బిఐ నిబంధనలకు పాతర
RELATED ARTICLES