పెరుగుతున్న సంఘీభావం
భగ్గుమన్న ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాలు
కుటుంబ సభ్యులతో డిపోల ముందు కార్మికుల ఆందోళనలు
హైదరాబాద్ సిటీబ్యూరో : ఆర్‌టిసి కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. సమ్మె చేపట్టి నేటికి 11వ రోజుకు చేరుకోగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌గౌడ్ మరణించారు. తాజాగా హెచ్‌సియు డిపో వద్ద సందీప్ అనే కండక్టర్ అత్మహత్యాయత్నం చేసుకున్నారు. బ్లేడుతో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సమ్మెపై ప్రభుత్వ మొండి వైఖరికి కార్మికులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రెవెన్యూ, రాజకీయ పార్టీ నేతలు భగ్గుమంటున్నాయి. నగరంలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. బస్‌డిపోల ముందు కుటుంబసభ్యులతో ఆర్‌టిసి కార్మికులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఆత్మబలిదానాలు చేసుకున్న డి.శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌లకు ప్రముఖులు సోమవారం నివాళులర్పించారు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు ప్రదర్శించారు. నగరవ్యాప్తంగా బస్‌డిపోల ముందు సంతాప సభలు ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని ప్రధాన డిపోల వద్ద జరిగిన కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు నేతలు పాల్గొన్నారు. దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ బస్‌డిపోల వద్ద జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎంపి సయ్యద్ అజీజ్‌పాషా, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కళావతి, ఛాయాదేవి ఇతర నాయకులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జెఎసి నాయకులు చేపట్టిన వంటావార్పు కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, సిపిఐ నగర కార్యదర్శి ఇటి నరసింహా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ మొడలు వంచైనా హక్కులను సాధించుకోవాలన్నారు. కార్మికులు ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని పేర్కొన్నారు. ఉప్పల్ డిపో వద్ద జరిగిన ధర్నాలో అఖిలపక్ష పక్ష నేతలు, ఆర్‌టిసి జెఎసి నేతలు పాల్గొన్నారు. ఆర్‌టిసిని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎవ్వరూ భావోద్వేగాలకు గురై బలిదానాలకు పాల్పడవద్దని, పోరాడి డిమాండ్లను సాధించుకుందామని ఆర్‌టిసి జెఎసి నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జెఎసి నాయకులు మంత్రుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వామపక్ష ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్‌టిసి క్రాస్‌రోడ్డులోని బస్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నగరవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడ్డారు.
ఆర్‌టిసి సమ్మె ఉధృతం
RELATED ARTICLES