నేడు న్యాయస్థానానికి హాజరుకానున్న సిఎస్, మరో ముగ్గురు సీనియర్ ఐఎఎస్‌లు
తొలి కేసుగా విచారించనున్న చీఫ్ జస్టిస్ బెంచ్
ప్రజాపక్షం/హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు గురువారం హైకోర్టులో జరిగే విచారణ ఆధారం కానుంది. 33 రోజులగా సమ్మెలో ఉన్న ఆర్‌టిసి కార్మికులతో పాటు, రాజకీయ పార్టీలు, రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలు హైకోర్టులో ఏమి జరగనుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి వరకు కార్మికులు చేరకపోతే ఇప్పటికే సగం ప్రైవేటు చేసిన ఆర్‌టిసిని ప్రభుత్వం మిగతా సగం కూడా ప్రైవేటుకు అప్పగిస్తామని హెచ్చరించింది. ఆర్‌టిసి సమ్మెపై వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట పలుమార్లు విచారణకు వచ్చింది. అయితే, అధికారులు తప్పుడు లెక్కలు ఇస్తున్నారంటూ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన సమాచారంతో కోర్టుకు బుధవారం హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిహెచ్‌ఎంసి కమిషనర్, ఆర్‌టిసి ఇన్‌ఛార్జ్ ఎండిలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన బెంచ్ ఎదుట నలుగురు కీలక ఐఎఎస్ అధికారుల హాజరుకానున్నారు. అటు నిత్యం ప్రయాణం చేసే సుమారు కోటిమంది ప్రయాణికులు,సమ్మెలో ఉన్న 49వేల ఆర్‌టిసి కార్మికుల కుటుంబాలను దృష్టి లో పెట్టుకొని ఈ కేసుకు హైకోర్టు ప్రాధాన్యతనిస్తోంది. కోర్టు ప్రారంభంకాగానే ఉదయం10:30 గంటలకు తొలి కేసుగా దీనిని విచారణకు చేపట్టనుంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో ఆర్‌టిసి ఎండి,ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి బుధవారం కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేశారు. ప్రభు త్వం ఇప్పటికీ తాము ఆర్‌టిసికి డబ్బులు ఇవ్వలేమని, ఇప్పటికే ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఇచ్చామనే మొండిగా వాదిస్తోంది.మరోవైపు స్వ యంగా సిఎం విధించిన మూడు డెడ్‌లైన్‌లను కాదని సమ్మె కొనసాగిస్తున్న ఆర్‌టిసి కార్మికులు హైకోర్టు వైపు ఆశగా చూస్తున్నారు. ప్రభు త్వం ఏకపక్షంగా, తప్పుడు లెక్కలు చెబుతోందని, అయినప్పటికీ దబాయిస్తూ కార్మికుల పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తోందని వారు చెబుతున్నారు.