కాల్పులు జరిపిన ఎపికి చెందిన కానిస్టేబుల్
బస్సు దిగమన్నందుకు తోటి ప్రయాణికులకు గన్‌తో బెదిరింపులు
హైదరాబాద్‌లో కలకలం
సిసిటివి ఫుటేజీల ఆధారంగా నిందితుడి గుర్తింపు
ప్రజాపక్షం/సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఆర్‌టిసి బస్సులో గురువారం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. బస్సు దిగమన్నందుకు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఎపి 28 జెడ్ 4468 నెంబర్ గల ఆర్‌టిసి బస్సు సికింద్రాబాద్ నుంచి మణికొండకు వెళుతోంది. బస్సు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్దకు చేరుకునే సమయంలో సఫారీ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి తోటి ప్రయాణికులతో ఘర్షణకు దిగాడు. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీని తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ బస్సు రూప్ టాప్ నుంచి దూసుకెళ్లింది. అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి వెనక డోర్ నుంచి దిగి వెళ్లిపోయాడు. కాల్పులు జరిగిన సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కాల్పులకు ఒక్కసారిగా బెంబేలెత్తినా బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా డిపోకు తీసుకుని పోయాడు. ఈ విషయాన్ని ఆర్‌టిసి అధికారులు దృష్టికి తీసుకునివెళ్లి వారి సలహా మేరకు కండక్టర్ భూపతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.