పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసిన యాజమాన్యం
చార్జీలపై అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష
ప్రజాపక్షం/హైదరాబాద్ బస్సు చార్జీలు పెంచాలని ఆర్టిసి యాజమా న్యం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఏ బస్సుకు ఎంత మేర కు పెంచాలనే అంశాలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టిసి ఎండి సజ్జనార్‌తో ఆదివారం సుదీర్ఘ సమీక్ష చేశారు. చా ర్జీల పెంపుపై ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్‌కు కనీస చార్జ్జి రూ.10, సిటీ సబర్బన్ బస్సులకు రూ.10, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.10, మెట్రో డిలక్స్కు రూ.15, పల్లె వెలుగు రూ.10, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.15, డిలక్స్ బస్సులకు రూ.20, సూపర్ లగ్జరీ బస్సులకు రూ.25, రాజధాని ఎసి బస్సులకు రూ.35, గరుడప్లస్ ఎసి బస్సులకు కిలోమీటర్‌కు రూ.35 వసూలు చేస్తున్నారు. ఆర్టిసి చార్జీల పెంపుపై అధికారులు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్‌కు రూ.25 పైసలు, ఎక్స్‌ప్రెస్, ఆపైన బస్సులకు కిలోమీటర్‌కు రూ.30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్‌కు రూ.25 పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆపై సర్వీసులకు రూ.30 పైసలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టిసి ఎండి సజ్జనార్ మూకుమ్మడి అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. చార్జీలపై వీరు రూపొందించిన ప్రతిపాదనలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వీలైనంత త్వరగానే సిఎం కెసిఆర్ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. గడిచిన మూడేళ్లలో ఆర్టిసి ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టిసికి రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా వల్ల కొద్దిరోజులు నష్టాలు వస్తే, పెరిగిన డిజిల్ ధరలతో మరికొన్ని నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టిసి యాజమాన్యం అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆర్టిసి బస్సు చార్జీలు పెంచితే, ఇప్పుడున్న నష్టాల్లో కొంత మేరకైనా తగ్గే అవకాశాలున్నాయని యాజమాన్యం అంచనా వేస్తోంది. తద్వారా ఆర్టిసి తిరిగి గాడినపడే అవకాశాలున్నట్లు అధికారులు ఆకాంక్షిస్తున్నారు.
ఆర్టిసి చార్జీలు పెరుగుతున్నాయ్!
RELATED ARTICLES