సమస్యలు పరిష్కరించకుంటే 17వ తేదీ అనంతరం ఏ రోజైనా సమ్మె చేస్తాం
ఆర్‌టిసి యాజమాన్యానికి ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నోటీస్ అందజేత
దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికులు, ఉద్యోగులు ఈ నెల 17వ తేదీ తరువాత ఏ రోజు నుంచైనా సమ్మెబాట పట్టనున్నారు. ఈ మేరకు టిఎస్‌ఆర్‌టిసి ఎంప్లాయీస్ యూనియన్ మంగళవారం ఆర్‌టిసి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేసింది. ఆర్‌టిసి సంస్థతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 17వ తేదీలోగా చర్యలు తీసుకోనట్లయితే సమ్మెను ప్రారంభిస్తామని ఎంప్లాయీస్ యూనియన్ నోటీసులో తెలియజేసింది. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాబు ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బస్‌భవన్‌లో ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) టి.వి.రావును కలిసి సమ్మె నోటీసును అందజేసింది. అనంతరం బాబు మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ఆర్‌టిసి యాజమాన్యం విఫలమైందన్నారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యానికి ఏళ్ల తరబడి సమయం ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు కార్మికుల సమస్యలు ఉన్నాయన్నారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2013 అక్టోబర్‌లోనే ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, అయినా నేటివరకు దానిపై ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోవడంతో విలీన ప్రక్రియ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌టిసిలో కండక్టర్ డ్రైవర్లు తమ ఉద్యోగ విషయంలో అభద్రతా భావానికి లోనవుతున్నారని, వారికి ఉద్యోగ భద్రత యాజమాన్యం ఎందుకు కల్పించలేకపోతోందని ప్రశ్నించారు. రాజిరెడ్డి మాట్లాడుతూ 2017 వేతన సవరణ నేటివరకు అమలు కాకపోవటం వల్ల ఆర్‌టిసి కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని, 29 మాసాలు గడుస్తున్నా ఆపద్ధర్మ గుర్తింపు సంఘంగా ఉన్న టిఎంయు వేతన సవరణ చేయలేక చతికిలపడిపోయిందని విమర్శించారు. గత ఐదేళ్లుగా ఆర్‌టిసిలో రిక్రూట్‌మెంట్ జరగకపోవడంతో కార్మికులపై విపరీతమైన పనిభారాలు పెరిగాయన్నారు. వెంటనే అన్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల్లో నియామకాలు జరగాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 30 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణాను అరికట్టడం వలన ఆర్‌టిసికి సాలీనా వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, అందువల్ల ప్రభుత్వం అక్రమ రవాణాపై కొరడా ఎందుకు ఝళిపించటం లేదని ప్రశ్నించారు. డిజెబిలిటీ యాక్ట్ ప్రకారం కండక్టర్, మెకానిక్, ఆర్టిజాన్‌లకు ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశం ఉన్నా దానిని టిఎంయు రద్దు చేసిందని విమర్శించారు. సీలింగ్ లేకుండా ఆర్‌టిసి కార్మికులకు ప్రస్తుతం అందుతున్న గ్రాట్యుటీ విధానాన్ని టిఎంయు రద్దు చేసి, కొత్తగా గ్రాట్యుటీ చెల్లింపుల్లో సీలింగ్ తీసుకువచ్చి ఆర్‌టిసి కార్మికులను నష్టపరిచిందని మండిపడ్డారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.వెంకటిగౌడ్, ఉపాధ్యక్షులు అరుణకుమారి, ఉప ప్రధాన కార్యదర్శులే ఇ.వెంకన్న, అహ్మద్ అలీ, రాష్ట్ర కార్యదర్శులు డి.గోపాల్, కె.రామిరెడ్డి, కె.రాజేందర్, రాష్ట్ర కోశాధికారి ఎ.త్రిలోచన, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బి.జక్కరయ్య, బి.జ్యోతి, వి.కె.స్వామి,ఎస్.కె.ఖాదర్, కె.ఎస్.లతతో పాటు వివిధ జోన్ల కార్యదర్శులు ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఇదిలావుండగా ఆర్‌టిసి సంస్థ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వెముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసింది.
ఆర్‌టిసిలో సమ్మె నోటీస్
RELATED ARTICLES