ఆర్‌టిసినే అదనంగా పొందింది
హైకోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులు
ప్రజాపక్షం/హైదరాబాద్; ఆర్‌టిసి అవసరమైన దానికంటే అధిక మొత్తంలో ప్రభుత్వ సేవలను వినియోగించుకుందని, ఆర్‌టిసిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన వాస్తవమేనని ఇన్‌ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్‌శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని గట్టెక్కించాలంటూ సంస్థ ఆర్థిక స్థితిగతులపై రవాణా శాఖ మంత్రికి 2019 సెప్టెంబర్ 11న ఒక నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి ప్రకటన తర్వాత 2019 బడ్జెట్‌లో కేటాయించిన రూ.550 కోట్లకు రూ.455 కోట్లు సంస్థకు చేరాయన్నారు. జిహెచ్‌ఎంసి నుంచి రూ.1492.70 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని ప్రకటించారని, అది ఆర్‌టిసి పొందాల్సిన క్లెయిమ్ లేదా జిహెచ్‌ఎంసి తీసుకున్న రుణం కాదన్నారు. మంత్రి ప్రకటనలో ‘అవుట్ స్టాండింగ్ లోన్” అనే అంశంలో ప్రభుత్వం నుంచి పొందే రుణం అని స్పష్టంగా ఉందన్నారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్‌టిసి రూ.840.49 కోట్లు మేర రుణాన్ని పొందినట్లు, దీన్ని సంస్థ అవసరాలకనుగుణంగా, అవసరమైతే కొత్త బస్సుల కొనుగోలుకు వినియోగించుకోవచ్చని తెలిపారు. మరో రూ.345 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీర్‌గా ఉందన్నారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, పెట్టుబడి సాయం కింద అందించిన రూ.447.08 కోట్ల గురించి మంత్రి ప్రకటనలో లేదన్నారు.2014 నుంచి 1 2019 వరకు ఆర్‌టిసి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం చెల్లించాల్సింది రూ. 3006.15 కోట్లు అని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఆర్‌టిసి రూ.3903.55 కోట్లు పొందిందని, దీని ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కంటే రూ.897.40 కోట్లు అదనంగా పొందిందన్నారు. దీనికి అదనంగా రూ.850 కోట్ల మేర రుణం పొందిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించాలని ఎన్నడూ కోరలేదన్నారు. జిహెచ్‌ఎంసి చట్టం 1955లోని సెక్షన్ 112(30) కార్పొరేషన్ పరిధిలో తిరుగుతున్న ఆర్‌టిసి బస్సులకు వచ్చే నష్టాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయించాల్సిన మొత్తాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. అయినా బకాయిలు చెల్లించాలని జిహెచ్‌ఎంసిని ఆర్‌టిసి కోరుతునే ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా రూ.336.40 కోట్లను జిహెచ్‌ఎంసి చెల్లించిందన్నారు. జిహెచ్‌ఎంసి తీవ్ర ఆర్థిక లోటులో ఉందని 2019 అక్టోబరు 30న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాసిందన్నారు. ఆర్‌టిసికి చెల్లించాల్సిన సొమ్ము ఆ సంస్థ నుంచి జీహెఉచ్‌ఎంసీ పొందిన రుణం కాదన్నారు. ఆర్‌టిసి నష్టాలను పూర్తిగా భరించాల్సిన అవసరం జిహెచ్‌ఎంసికి లేదన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఆర్‌టిసి 2019 ఫిబ్రవరి 12న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిందని, దీన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనకు ఆనెల 15న పంపినట్లు తెలుపుతూ 2013 సంవత్సరానికి (రాష్ట్ర పునర్విభజనకు ముందు) సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని పేర్కొన్నారు.