చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు కూడా..
ప్రధానమంత్రి మోడీ ప్రకటన
న్యూఢిల్లీ : తెలుగుతేజం పి.వి.నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. ఆయనతోపాటు మరో మాజీ ప్రధానమంత్రి చరణ్‌సింగ్, హరిత విప్లవ రథసారథి, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్‌లకు కూడా భారతరత్న ప్రకటించారు. పి.వి.నరసింహారావు ఆర్థిక సంస్కరణ అమలు చేసిన మొనగాడుగా పేరుగాంచగా, స్వామినాథన్ వ్యవసాయరంగంలో విప్లవం సృష్టించిన ప్రపంచ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఈ పురస్కారాలు ప్రకటిస్తూ ఈ ముగ్గురు ప్రముఖులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఏడాది ఈ పురాస్కారాలు ప్రకటించిన ఐదుగురు ప్రముఖులలో అద్వానీ ఒక్కరే సజీవంగా ఉన్నారు. ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగువాడు, తెలంగాణ తేజం పి.వి.నరసింహారావుకు ఈ అత్యున్నత పురస్కారం లభించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపించిన తరుణంలో నరేంద్రమోడీ 2.0 పరిపాలన చివరిదశలో గతం కంటే అత్యధికంగా ఈ ఏడాది మూడు విడతలుగా ఐదుగురు దేశ ప్రముఖులకు గరిష్టస్థాయిలో భారత రత్న అత్యున్నత పురస్కారాలు ప్రకటించి ఎన్‌డిఎ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 1999లో ఏకంగా ఒకేసారి నలుగురికి భారత రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు గొప్ప సేవలు చేశారని మోడీ కొనియాడారు. ఆంధప్రదేశ్ ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అత్యున్నత చట్టసభ సభ్యుడుగా విశిష్ట సేవలు అందించారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పి.వి.కొత్త పుంతలు తొక్కించారన్నారు. దేశ విదేశాంగ విధానికీ, భాష, విద్యారంగాలకు నిరుపమాన సేవలు అదించారన్నారు. దేశం అత్యంత సంక్లిష్టదశలో ఉండగా పి.వి. ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారని, దేశాన్ని పరివర్తన దిశగా మళ్లించారన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుండి పూర్తి పదవీకాలం పని చేసిన దక్షిణాది నాయకుడైన ఏకైక ప్రధానమంత్రి అన్నారు. చరణ్‌సింగ్‌కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించడం తమ ప్రభుత్వ అదృష్టమని, దేశానికి ఆయన చేసిన సేవలకుగాను ఈ పురస్కారాన్ని ఈ ఏడాది ఆయనకు అంకితం చేశామని నరేంద్రమోడీ అన్నారు. ఎం.ఎస్.స్వామినాథ్‌కు కూడా మోడీ ఘనగా నివాళులు అర్పించారు. దేశ స్వయం సమృద్ధికి ఆయన గొప్ప సేవలు చేశారన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడుగా, దేశ హోంమంత్రిగా జాతి నిర్మాణంలో కృషి చేశారని, ఎమర్జెనీ సమయంలో చాలా గట్టిగా కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడుగా నిలబడి పోరాటం చేశారని చరణ్‌సింగ్‌ను మోడీ కొనియాడారు. రైతులకోసం ఆయన అంకితభావంతో పనిచేశారని అన్నారు. దేశంలో మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చరణ్‌సింగ్ మనుమడు, ఆర్‌ఎల్‌డి పార్టీ నాయకుడు జయంత్ సింగ్ బిజెపితో జత కట్టేందుకు పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్న తరుణంలో చరణ్‌సింగ్‌కు ఈ పురస్కార ప్రకటన వెలువడింది. ప్రధానమంత్రి చంద్రశేఖర్ హయాంలో దేశం పూర్తిగా దివాళాతీసి బంగారం కూడా తాకట్టుపెట్టి దేశాన్ని నడిపించే పరిస్థితి వచ్చింది. అనంతరం ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు దేశ పగ్గాలు చేపట్టి సరళీకరణ విధానాలు అమలు చేశారు. ప్రైవేటు రంగానికి తలుపులు బార్లా తెరిచారు. ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి భారీ పోటీకి తెరతీశారు. దివాళా తీసిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సరళీకరణ విధానాలను అమలోకి తెచ్చిన తొలి ప్రధానమంత్రిగా పేరు పొందారు. నెహ్రూ కుటుంబేతర కాంగ్రెస్ నాయకుడుగా ఐదేళ్ళ పూర్తి పదవీకాలం (1991 దేశానికి నాయకత్వం వహించి పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా కొనసాగారు. కాగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జాట్ నాయకుడు, రైతు ఉద్యమ నాయకుడు చౌధురీ చరణ్‌సింగ్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల రథసారథులలో ఒకరుగా ఏడాదికాలం (1979 ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది తొలుత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వెనుకబడిన తరగతుల నాయకుడు కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించాక, అయోథ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రధాన కారకుడు, భారత విశ్రాంత ఉప ప్రధానమంత్రి ఎల్.కె.అద్వానీకి భారతరత్న ప్రకటించారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై దేశంలో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.
పి.వికి పురస్కారంపై సోనియా సహా
పలువురు ప్రముఖుల హర్షం
పి.వి.నరసింహారావుకు భారత రత్న ప్రకటనపై కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హర్షం ప్రకటించారు. “నేను దీనిని ఆహ్వానిస్తున్నాను, ఎంతో హర్షం ప్రకటిస్తున్నాను” అన్నారు. పి.వి.నరసింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా, ముజఫర్ నగర్ ఎంపి సంజీవ్ బాల్యన్, జనతాదళ్ యునైటెడ్ ఎంపి రాజీవ్ రంజన్ సింగ్ తదితర ప్రముఖులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ దేశ ప్రముఖులకు ఏనాడో ఈ పురస్కారాలు ఇచ్చి ఉండాల్సిందని, మొదటిసారి తమ ప్రభుత్వం ఈ పని చేసిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ ప్రజలకు, ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రముఖులకు ఈ పురస్కారాలు దక్కాయని శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు.
ఆర్థిక సంస్కరణల రథసారథి, తెలుగు తేజం పివి నరసింహారావుకు భారతరత్న
RELATED ARTICLES