HomeNewsWorldఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం

ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం

చైనా, వియత్నాం సంయుక్త ప్రకటన
బీజింగ్‌: పరస్పరం ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టపరచుకుంటామని చైనా, వియత్నాం సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఉమ్మడి కమ్యూనిస్టు భావజాలానికి ఆమోదం తెలిపాయి. వియత్నాం కొత్త అధ్యక్షుడు టో లామ్‌ తన భార్య ఎన్గో ఫువాంగ్‌ లైతో కలిసి మూడు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్‌ చేరుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఈ దంపతులకు చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్‌, ఆయన భార్య పెంగ్‌ లి యువాన్‌ ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం జిన్‌పింగ్‌ మాట్లాడుతూ వియత్నాంతో తమ మైత్రీ సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల మధ్య గాఢమైన అనుబంధం ఉందని అన్నారు. నేడు ప్రపంచంలో రెండు పాలక కమ్యూనిస్టు పార్టీలు ఒకటిగా నిలిచి, పరస్పర సహకారానికి ప్రతిజ్ఞ చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన లామ్‌, చైనా పర్యటనకు రావడం హర్షణీయమని జిన్‌పింగ్‌ అన్నారు. పార్టీ అత్యున్నత నాయకుడిగా 13 సంవత్సరాలు సేవలు అందించిన నుయెన్‌ ఫు ట్రోంగ్‌ మృతి చెందడంతో, ఆయన స్థానంలో లామ్‌ ఎన్నికయ్యారు. జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, చైనాతో తమ దేశానికి సాన్నిహిత్యం ఉందని అన్నారు. చైనా అభివృద్ధిని గమనిస్తున్నామని చెప్పారు. ‘మీ నాయకత్వంలో పార్టీ, ప్రభుత్వం, చైనా ప్రజలు సాధించిన విజయాలకు సంతోషిస్తున్నాను’ అంటూ జిన్‌పింగ్‌ను ప్రశంసించారు. విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్‌ వంటి 14 రంగాల్లో సహకార ఒప్పందాలపై సంతకాలు జరగడాన్ని ఇద్దరు నేతలు పర్యవేక్షించారు. వియత్నాంకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, గత సంవత్సరం ఈ రెండు దేశాల మధ్య 172 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. కాగా, ‘వన్‌ చైనా’ సిద్ధాంతానికి అనుగుంంగా, స్వయంపాలిత తైవాన్‌ విషయంలో చైనాకు వియత్నాం సంపూర్ణ మద్దతునిస్తున్నదని లామ్‌ స్పష్టం చేశారు. హాంకాంగ్‌, టిబెట్‌, జిన్జియాంగ్‌ తదితర ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, అవి ఆ దేశ అంతర్గత వ్యవహారాలని వ్యాఖ్యానించారు. అమెరికా, రష్యా తదితర దేశాలతో వియత్నాం సత్సంబంధాలను కలిగి ఉందన్నారు. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో జిన్‌పింగ్‌ వియత్నాం సందర్శించినప్పుడు, ఇరు దేశాల వ్యూహాత్మక ప్రాధాన్యతగల భాగస్వామ్య భవిష్యత్తును నిర్ధారించుకుంటామని ప్రకటించిన విషయాన్ని లామ్‌ ప్రస్తావించారు. అందుకు అనుగుణంగానే ఒప్పందాలు జరిగినట్టు ఆయన తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments