ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై వామపక్షాల ఆగ్రహం
8న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సంక్షోభంలోని నెట్టాయని వామపక్షాలు విమర్శించాయి. ఆర్థిక సంస్కరణల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభం ఎదుర్కొంటున్నాయని, నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్థిక రంగం విచ్చిన్నకరస్థితికి చేరుకుంటోందని, వీటిని చక్కదిద్దడంలో, ఆర్థిక మాంద్యం నుండి బయటపడే ప్రయత్నం చేయకపోగా కార్పొరేట్, పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తున్న కేంద్రం, ప్రజల దృష్టి మళ్లించేందుకే సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను ముందుకు తెచ్చిందని ధ్వజమెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చాయి. జనవరి 8న జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీల సంఘీభావ సదస్సు గురువారం ఎస్‌వికెలో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా సదస్సు ఆమోదించింది. ఈ సదస్సులో పోటు రంగారావు (సిపిఐ ఎంఎల్ ఎన్‌డి), తాండ్రకుమార్ (ఎంసిపిఐ), గోవర్ధన్ (సిపిఐఎంఎల్‌ఎన్‌డి), జానకీరాములు (ఆర్‌ఎస్‌పి), రాజేష్ (సిపిఐఎంఎల్ లిబరేషన్), ప్రసాద్ (సిపిఐ ఎంఎల్) ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, రైల్వే, రక్షణ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రోడ్డు రవాణా, ఓడరేవులు, బొగ్గు, విద్యుత్, ఉక్కు, పెట్రోలియం తదితర సంస్థల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని సదస్సు ఆరోపించింది. కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా సవరించారని, కార్మిక వర్గానికి హాని కల్గిస్తూ బహుళజాతి సంస్థలకు రాయితీల పేరుతో లక్షల కోట్ల రూపాయలను కట్టబెడుతున్నారని సదస్సు విమర్శించింది. 8న సార్వత్రిక సమ్మెలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యువజన, మహిళ, విద్యార్థుల సమస్యలతో పాటు యావత్ ప్రజల మౌలిక సమస్యలు డిమాండ్లుగా పొందుపర్చారు. ఈ సమ్మెలో కార్మిక, ప్రజా సంఘాలు తమ శ్రేణులను మోహరించి విజయవంతం చేయాలని వామపక్షాల సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని, దేశం తిరోగమనంలోకి వెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల కుదింపు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం,ప్రైవేటీకరణ, డి మానిటైజేషన్ కారణంగా నిరుద్యోగం పెనుభూతంగా మారిందన్నారు.
ఆర్థిక వ్యవస్థ దేశాన్ని సంక్షోభంలోకి ప్రభుత్వం
RELATED ARTICLES