HomeNewsBreaking Newsఆర్థిక వ్యవస్థ కుదేలు

ఆర్థిక వ్యవస్థ కుదేలు

బిజెపి పాలనపై గులాం నబీ ఆజాద్‌ విమర్శ
హైదరాబాద్‌ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, నిరుద్యోగం పెరుగుతోందని, వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకున్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. బిజెపి వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 5 నుండి 15వ తేదీ వరకు కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, ఢిల్లీలో డిసెంబర్‌లో భారీ సభను తలపెట్టిందని తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యాలపై దేశవ్యాప్తంగా 650 కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టామన్నారు. కేవలం ఒక వర్గం మరో వర్గానికి మధ్య గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వంలో బ్యాంకులను మోసం చేసిన కేసులు 25 వేలు నమోదయ్యాయయని, తద్వారా రూ.3 లక్షల కోట్ల దుర్వినియోగమైందని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందన్నారు. 2014లో అధికారంలోకి రాగానే 10కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి 50 లక్షల కూడా ఇవ్వలేదన్నారు. నల్లధనం బయటకు తెచ్చి రూ.15 లక్షలను ప్రతి పేదవారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తామని హామీనిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్య రెట్టింపు అయ్యిందని, ఆర్థిక మాంద్యంతో దేశాన్ని వెనక్కి నెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్‌బిఐని కూడా ప్రభుత్వం మింగేయాలని చూస్తున్నారన్నారు. నాలుగేళ్ళలో ఆర్‌బిఐ నుంచి రూ. 4 లక్షల కోట్లు తీసుకుందని వివరించారు. డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ను పెంచి ప్రజల నుంచి రూ. 13 లక్షల కోట్లు వసూలు చేశారని తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతు,యువత, పేదల వ్యతిరేకమని, ఇలాంటి ప్రభుత్వం తమకు వద్దని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్‌సిపిలో మోడీ ప్రభుత్వం సంతకం చేయకపోవడం కాంగ్రెస్‌ విజయమని, అందులో చేరవద్దని కాంగ్రెస్‌ ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక వేళ ఆర్‌సిపిలో సంతకం చేసి ఉంటే దేశం ఘోరంగా ఉండేదని, దేశీయ ఉత్పత్తులపై విదేశీ పెట్టుబడులు, దిగుబడి జరిగేదని తెలిపారు.ప్రధాన మంత్రి సంతకం చేయకపోవడం కాంగ్రెస్‌ విజయమని అన్నారు. సోనియాగాంధీ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నా రు. తెలంగాణలో కూడా తాము నిరసన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.తెలంగాణ నాయకుల మధ్య సయో ధ్య ఉన్నదన్నారు. మహారాష్ట్ర అంశం జాతీయ పార్టీ చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
షాట్‌కట్‌లో డబ్బులు సంపాదించాలనే ఆశ..
రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమని, కొంత మంది నాయకులు క్యాష్‌ క్రాప్‌ గేమ్‌లా షాట్‌ కట్‌లో డబ్బులు సంపాదించాలనే ఆశతో ఉన్నారని గులాంనబీ ఆజాద్‌ అన్నారు.త్వరగా డబ్బులు సంపాదించాలనే వా రు రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండబోరని తెలిపారు. జమ్ములో 5 గంటల పాటు వేచిఉన్నప్పటికీ తనతో పాటు సిపిఎం నేతలను వెనక్కి పంపించారని అన్నారు. కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులను, మీడియాను కశ్మీర్‌కు వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కశ్మీర్‌ అంశం మరోసారి అంతర్జాతీయ అంశంగా మారిందన్నారు. లెఫ్ట్‌,రైట్‌ పార్టీ ఎంపీలకు కూడా ఈ పరిస్థితి తప్పడం లేదని వివరించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బాబ్రీమజీద్‌, భోఫార్‌ అంశంపైన బిజెపి మాట్లాడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, దేశ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడాలని బిజెపి నేతలకు సూచించారు. బిజెపి నేతలకు రాహుల్‌ గాంధీ ఎక్కడ ఉన్నరో కూడా తెలియక పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఆర్‌టిసి కార్మికులను పట్టించుకోని సిఎం కెసిఆర్‌-
50 వేల ఆర్‌టిసి కార్మికులు 30 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ సిఎం కెసిఆర్‌ పట్టించుకోవడం లేదని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఇప్పటికే చాలా మంది చనిపోయరని ఆవేదన వ్యక్తం చేశారు.వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్న సిఎం తాను ఇచ్చిన హామీలను అమ లు చేయడం లేదని అన్నారు.తహసిల్దార్‌ విజయారెడ్డి మృతి పట్ల పార్టీ తరుపున శ్రద్ధాంజలి ఘటించారు.ఇలా ంటిసంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
ముఖ్యనేతలతో భేటీ
అనంతరం కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో గులాం నబీ ఆజాద్‌ సమావేశమయ్యారు.ఈ భేటీలో కాంగ్రెస్‌ నేతలు కుం దూరు జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గీతారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ తదితరులు హాజరయ్యారు. దేశవ్యాప్త ఆందోళనను రాష్ట్రం లో విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో బిజెపి ప్రధాన శతృవు కాదని, ఒకవైపు ఆర్‌టిసి కార్మికుల సమ్మె, తహసీల్దారు సజీవ దహనం సాగుతుంటే ఈ ఆందోళన జనం దృష్టిని ఆకర్షిస్తుందా?అని ఒక నేత అ నుమానం వ్యక్తం చేయగా, ఇది అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు అని కచ్చితంగా అమలు చేయాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments