ఆర్థిక వనరులపై ప్రత్యామ్నాయం తప్పదా? : సర్కార్ తర్జన భర్జన
ప్రజాపక్షం / హైదరాబాద్ : బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై గడచిన ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆసక్తిని కనబర్చడమే లేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్ )కు ఇనుప ఖనిజ ఏర్పాటు బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అయితే రాజకీయ కారణాలా? లేదా ఇంకేమైనా ఉన్నాయో తెలియదు కానీ… బయ్యారం విషయంలో మాత్రం కేంద్రం అంత ఆసక్తిని కనబర్చడం లేదు. బయ్యారంలో వెలికి తీసిన ఇనుప ఖనిజం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో లేదని, పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇంకా లోతుగా అధ్యయనం చేస్తాం అని మరోసారి కేంద్రం ప్రకటనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందంటూ అధికార పార్టీ ఎంపిలు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కేంద్రం చెబుతున్నట్లు బయ్యారంలో ఇనుప ఖనిజం తక్కువగా ఉన్నట్లు భావిస్తే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఎన్‌ఎండిసికి చెందిన బైలడిల్లా ప్రాంతం నుండి ముడి ఇనుప ఖనిజాన్ని బయ్యారానికి తరలిస్తామని చెప్పింది. ఇందుకు ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటుకు అవసరమైన నివేదికను అందించడానికి ఏడాది క్రితం రూ. 2 కోట్లు విడుదల చేసింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బాధ్యతను సింగరేణి కాలరీస్ సంస్థకు అప్పగిస్తామని ప్రకటన చేసింది. అయితే అది ఇప్పటికీ ఇంకా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ఉక్కు కర్మాగారం లో శుద్ధి చేసుకోవచ్చని, ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ విశాఖ పట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు హయాంలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఉక్కు కర్మాగారాన్ని కడప జిల్లాలోనూ ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేసింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైనా పడింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బయ్యారంలోనూ ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవుతుందా? లేదా అన్న భావన రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాల్లో నెలకొని ఉంది.