రూ.30వేల కోట్ల బిల్లుల పెండింగ్ ఎందుకు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూటి ప్రశ్న
22 నుండి మంచిర్యాలలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు
మహాసభను ప్రారంభించనున్న డి.రాజా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నట్లు బ్రహ్మాండంగా ఏమీ లేదని, అదే నిజమైతే ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశారని, రైతు రుణమాఫీ, రైతుబంధు, పెన్షన్లు, పూర్తిస్థాయిలో ఎందుకు అమలు కావడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడినా తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుందని మంత్రి కెటిఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటప్పుడు ఎందుకు రాష్ట్రంలో రూ.30వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభ ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు మంచిర్యాలలో జరగనున్నట్లు తెలిపారు. మఖ్దూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్, హైదరాబాద్ కార్యదర్శి ఇటి నరసింహ, సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్‌తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్మాణ మహాసభ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గుడ్డిలో మెల్లలాగా ఉందని, అంతమాత్రాన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సరికాదని చాడ హితువు పలికారు. అంగన్‌వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి అనేక బకాయిలు పేరుకుపోయాయన్నారు. హైదరాబాద్ నగరం ముందు నుండి వ్యాపార కేంద్రంగా బలంగా ఉందని, దేశంలో ఎక్కడా లేనప్పటికీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతుండడం చూసి అంతా బాగుందనుకోవడం సమంజసం కాదన్నారు. ఫిబ్రవరి 22 నుండి 24 వరకు మంచిర్యాలలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు జరుగనున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు నిర్మాణ మహాసభలను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి,రాజా ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే జిల్లాల్లో నిర్మాణ మహాసభలు పూర్తికావొచ్చాయన్నారు.
మోడీ ప్రభుత్వంతో ప్రజాస్వామ్యానికి ముప్పు
మోడి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం లో భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తూ మతోన్మాద చర్యలతో ప్రజల్లో గందరగోళం, అశాంతిని ప్రేరిపిస్తున్న మోడి ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర శక్తులతో కలిసి కార్యాచరణను చేపడుతుందని చెప్పారు. కోల్‌కత్తాలో మూడు రోజుల పాటు జరిగిన సిపిఐ జాతీయ కౌన్సిల్ విస్తృత స్థాయి నిర్మాణ సమావేశాల్లో చర్చించిన అంశాలు, తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మోడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, కార్పోరేట్ అనుకూల బడ్జెట్, కార్మిక వ్యతిరేక బడ్జెట్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 నుండి 18 వరకు వారం రోజుల పాటు సిపిఐ ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని ప్రజలను జాగృతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని జాతీయ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలిపారు. 20వ తేదీనాడు ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి, లౌకికవాదాన్ని రక్షించండి’ అంశంపై మతోన్మాద శక్తుల చేతుల్లో హత్యకు గురైన గోవింద్ పన్సారే వర్థంతి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు మ్యానిఫెసో ్టడే సందర్భంగా సైద్దాంతిక అవగాహన కల్పించేందుకు లెఫ్ట్ పార్టీలను కలుపుకొని సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు సైద్ధాంతిక రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఆర్థిక పరిస్థితి బాగుంటే హామీల అమలేదీ?
RELATED ARTICLES