సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ ఆర్థిక,రాజకీయ, కుల వివక్ష పోరాటానికి “లాల్- పునాధి కావాలని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. కార్పొరేట్, మతోన్మాద శక్తులను గద్దె దించేందుకు, ఆర్థిక అసమానతలు, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా ‘లాల్- కలువడం అనివార్యమని, ఇందుకు అంబేడ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాకవి జయరాజు రాసిన “జాగోరే జాగో అంబేడ్కర్-భారత్ మార్క్ అంబేడ్కర్” పాటకు పదేళ్లు పూర్తున సందర్బంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సురవరం సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ పాతికేళ్ళ క్రితం జరిగిన జమాతే ఇస్లామీ సదస్సులో బిఎస్‌సి నేత కాన్షీరామ్‌తో పాటు తానూ హాజరయ్యానని, ఈ సందర్భంగా కమ్యూనిస్టులు,దళితులు కలిసి పోరాటం చేస్తే , ముస్లిములు కూడా కలిసి వస్తారని జమైతే ఇస్లామీ నేత ప్రతిపాదించిన విషయాన్ని సురవరం సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఆ దిశగా కొంత ప్రయత్నాలు సాగినప్పటికీ తమదే సరైన మార్గమనే పిడివాదంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత లాల్-నీల్ మైత్రి చర్చకు వచ్చిందన్నారు. మనుధర్మం ఆధారంగా పరిపాలన
ఆర్‌ఎస్‌ఎస్, బిజెపికి పాకిస్తానే ఆదర్శమని సురవరం సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చిన జిన్నా సమాధి వద్దకు నాటి ఉప ప్రధాని అద్వానీ వెళ్ళారని, జిన్నాను యుగ పురుషునిగా కొనియాడారని గుర్తు చేశారు. నాటి వాజ్‌పేయ్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటూనే నెమ్మదిగా హిందూత్వాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తే, మోడీ ప్రభుత్వం ఆ పనిని బలవంతంగా వేగంగా చేస్తోందన్నారు. మనుధర్మం ఆధారంగానే భారతదేశాన్ని పాలించేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్పొరేట్ రాజ్యం ఏర్పాటుకు జరిగే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కొవిడ్ కాలంలో అంబానీకి గంటకు రూ. 90 కోట్ల చొప్పు ఆదాయం వస్తే పేద వర్గాల్లోని 85 శాతం మంది కేవలం రెండు పూటల భోజనం మాత్రమే లభించిందని వివరించారు.
మార్కిజం, అంబేడ్కరిజాలే అవసరంః సతీష్ చందర్
ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్ మాట్లాడుతూ ఆకలి, అన్నం అనే వంతెనను మార్క్ వేస్తే, అవమానం, ఆత్మాభిమానం అనే వంతెనను డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వేశారన్నారు. మార్కిజం, అంబేడ్కరిజం రెండూ సైన్స్ లాంటివని, ఈ రెండూ చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ప్రపంచానికి మార్క్, అంబేడ్కర్ అవసరమని, అందుకే మార్కిజానికి అంబేడ్కరిజం అనే కళ్ల జోడు పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకు పరువు హత్యలు జరుగుతున్నాయని తెలిపారు.
రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ తన అనుభవం నుంచి భవిష్యత్‌ను చూసిన వ్యక్తి ప్రజాకవి జయరాజు అని అన్నారు. మార్స్, అంబేడ్కరిజం అవశ్యకతను తన పాట ద్వారా తెలియజేశారన్నారు. సాహితీవేత్త డాక్టర్ విజయభారతి మాట్లాడుతూ అంబేడ్కరిజం, మార్కిజంను లోతుగా అధ్యయనం చేయాలన్నారు. సాహితీవేత్త కూయి కోటేశ్వర్ రావు మాట్లాడుతూ దేశాన్ని కమ్మెస్తున్న కషాయ జెండా నుంచి దేశ విముక్తి కోసం జరగాల్సిన పోరాటాన్ని ‘అంబేడ్కర్-భారత్ మార్క్’పాట గుర్తు చేస్తోందన్నారు. ఈ సదస్సులో సాహితీ వేత్తలు, రచయితలు బొర్ర గోవర్దన్‌ను సురవరం సుధాకర్ రెడ్డి శాలువతో సన్మానించి అవార్డ్‌ను బహుకరించారు. ఈ సదస్సులో గేయ రచయితలు, సాహితీవేత్తలు వెంకటేశ్వర్లు, డిఎల్.ఆర్ ప్రసాద్, మల్లేషం, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ తదితరులు హాజరయ్యారు.
ఆర్థిక,రాజకీయ, కుల వివక్షలపై పోరాటానికి “లాల్-నీల్” పునాది కావాలి
RELATED ARTICLES